వరంగల్, మార్చి 6(నమస్తేతెలంగాణ) : ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో ఈ నెల 6 నుంచి 8 వరకు అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం పండుగ వాతావరణంలో సంబురాలను నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నెక్కొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన సంబురాలకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనేక సంక్షేమ పథకాలతో మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలతో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానం చాటారు. ఎమ్మెల్యే పెద్దికీ మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టారు. జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండల కేంద్రంలో 7, 8 తేదీల్లో జరిగే మహిళా క్రీడోత్సవాల్లో ఊరూరి నుంచి మహిళలు పాల్గొనాలన్నారు. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్తో పాటు మహిళా కౌన్సిలర్లు, మహిళా సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు రాఖీలు కట్టారు.
ఎల్బీనగర్లో ఎమ్మెల్యే నన్నపునేని..
వరంగల్ పదమూడో డివిజన్లోని ఎల్బీనగర్ షాదీఖానలో ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు మొదటిరోజు ఘనంగా జరిగాయి. వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, సినీ నటుడు సుమన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళాబంధువు అని, మహిళల కోసం పెద్ద మనసుతో ఆలోచించి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఆడబిడ్డకు మేనమామై కల్యాణలక్ష్మి సాయంగా రూ.లక్ష అందజేసి వారి కుటుంబానికి దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ గొప్ప కార్యక్రమమని చెప్పారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరేందర్ తెలిపారు.
మహిళలు సంబురంగా ఉండేందుకు కేసీఆర్ మహిళాబంధు వేడుకలు అద్భుతంగా జరిగేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. సినీ నటుటు సుమాన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజల గురించి గొప్పగా ఆలోచించే నాయకుడు అన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ జోషి, టీఆర్ఎస్ నేతలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్‌లోని పలు డివిజన్లలోనూ జరిగిన సంబురాల్లో టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో పాటు సీవోలు, ఆర్పీలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, జీడబ్ల్యూఎంసీ పారిశుధ్య కార్మికులు, మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు.
సంబురాల్లో అరూరి..
వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో కేసీఆర్ మహిళాబంధు సంబురాలు జరిగాయి. పర్వతగిరిలో జరిగిన సంబురాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. గిరిజన మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. అనంతరం మ హిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇదే మండలంలోని దౌలత్‌నగర్‌లో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారు సునీతకు ఎమ్మెల్యే రూ.1,00,116 చెక్కును అందజేశారు. పర్వతగిరిలో సర్పంచ్ మాలతి ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళాబంధు సంబురాలు జరిగాయి. మహిళలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు.
వివిధ రంగల్లోని మహిళలను స్థానికులు సన్మానించారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగినులను సన్మానించారు. టీఆర్ఎ స్ నేతలు తోట శ్రీలత, తోటకూరి రాజమణి, పూజారి సుజాత, కోదాటి పద్మ, పాక సుజాత, హన్మకొండ ల క్ష్మి, కొండేటి సరిత, తుమ్మల రవీందర్ పాల్గొన్నారు.