వర్ధన్నపేట, మార్చి 5: పాఠశాలలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన బడి-మన బాధ్యత’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పిలుపునిచ్చారు. శనివారం ఇల్లంద ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ప్రభుత్వ బడులు బాగు పడితేనే పేద కుటుంబాలు భవిష్యత్లో ప్రగతి సాధిస్తాయని ఎంపీపీ అన్నారు. పేదలు చదువుకునే బడిలో అన్ని వసతులు కల్పిస్తే పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారన్నారు.
ఈ ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన సౌకర్యాలు, చేపట్టాల్సిన పనులపై ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించారు. అదనపు గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, ప్రహరీ తదితర అవసరాలను గుర్తించారు. ఇందుకోసం పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, దాతలు ఆర్థికంగా సహకరించాలని ఎంపీపీ పిలుపునిచ్చారు. సమావేశంలో సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఎస్ఎంసీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.