చెన్నారావుపేట, మార్చి 5: యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరడుగల వివేకానందుడి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే పునరుద్ధరించిన ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ (టు సర్వ్ ద సొసైటీ ) అధ్యక్షుడు వేములపల్లి రాజు, ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ శ్రీనివాసరావు, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్, సంతోష్, మహేందర్, కరుణాకర్, రాంగోపాల్, రాజేంద్రప్రసాద్, సతీష్, రమేశ్, భాస్కర్, చారి పాల్గొన్నారు.
అలరించిన క్రీడోత్సవాలు
నర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులో ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలు అలరించాయి. తొలుత కబడ్డీ పోటీలను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కబడ్టీ ఆటలో భాగంగా రెండు కోర్టుల్లో క్రీడాకారులు ఉండగా, సత్యవతి, ఎంపీ కవిత ఒక కోర్టులో, మరో కోర్టులో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పలువురు మహిళా క్రీడాకారులతో ఉండి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు అంపైర్లుగా వ్యవహరించారు.
మంత్రులకు వినతుల వెల్లువ
నర్సంపేట పర్యటనలో భాగంగా ముగ్గురు మంత్రులకు వినతులు వెల్లువెత్తాయి. హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతికి వినతి పత్రాలు అందజేశారు. జీపీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించాలని, ఓపీఎస్ పంచాయతీ సెక్రటరీలను జేపీఎస్లతోపాటు రెగ్యులర్ చేయాలని, చనిపోయిన కార్యదర్శుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ పలువురు కార్యదర్శులు మంత్రులకు విన్నవించారు. కార్యక్రమంలో టీపీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ వినోద్‌కుమార్, రమ్యకుమారి, కార్యదర్శులు పాల్గొన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్, అర్హులైన వారికి వీఆర్వోలకు సమానమైన ఇతర క్యాడర్లో పదోన్నతి కల్పించాలని కోరుతూ వీఆర్వోలు మంత్రులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని పలువురు విద్యుత్ కార్మికులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందించారు.
మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం
నల్లబెల్లి: నర్సంపేటలో వైద్యశాల భవనానికి శంకుస్థాపన చేసేందుకు ములుగు నుంచి 365 జాతీయ రహదారి మీదుగా వచ్చిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మండలంలోని బోల్లోనిపల్లెలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్వన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.