ములుగు రూరల్, మార్చి 5 : మొక్కు తీర్చేందుకు వెళ్లి ఇంటిదారి పట్టిన వారిని విధి పగబట్టింది. మరో గంటన్నరలో ఇల్లు చేరాల్సి ఉండగా డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. విగతజీవులుగా మార్చి అంతులేని విషాదం నింపింది. సంబురంగా భార్య, తల్లి, పిల్లలతో పాటు ఇంటి పక్కన వారిని తీసుకెళ్లిన ఇంటి యజమానికి పుట్డెడు దుఃఖాన్ని మిగిల్చింది. కన్న బిడ్డలు, తల్లిని కోల్పోయి కోలుకోలేకుండా చేసింది.
ములుగు మండలం ఇంచర్ల సమీపంలో ఎర్రగట్టమ్మ వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. పశువుల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం కోమటిపల్లిలోని కేసీఆర్ కాలనీకి చెందిన బొల్లెబోయిన రసూల్ మొక్కు తీర్చుకునేందుకు తన సమీపంలో ఉంటున్న తునికి జానీ అనే యువకుడి ఆటో కిరాయికి మాట్లాడుకొని ఈ నెల 3న కుటుంబ సమేతంగా వరంగల్‌లోని అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లాడు. ఆటోలో భార్య పద్మ, తల్లి వసంత, రామన్నగూడేనికి చెందిన తన చిన్నమ్మ గాదం కౌసల్య, కొడుకు అజయ్, కూతురు వెన్నెల, తమ ఎదురింటికి చెందిన చలమల్ల కిరణ్, డ్రైవర్ జానీని కలుపుకొని మొత్తం 8 మంది అన్నారం వెళ్లి శుక్రవారం మొక్కు చెల్లించుకున్నారు.
రాత్రి భోజనాలు చేసి అన్నారం నుంచి స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున ములుగు జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న ఎర్రి గట్టమ్మ వద్దకు రాగానే ఛత్తీస్‌గఢ్ నుంచి పశువుల లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ తునికి జానీ(23), చలమల్ల కిరణ్(16), బొల్లెబోయిన అజయ్(12), గాదం కౌసల్య(55) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన రసూల్, అతడి భార్య పద్మ, తల్లి వసంత, కూతురు వెన్నెలను స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ వెన్నెల(9), బొల్లెబోయిన వసంత(60) చనిపోయారు. రసూల్, అతడి భార్య పద్మ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే సీతక్క పరిశీలించి సంతాపం తెలిపారు.
డీసీఎం డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని డీసీఎంలో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పశువులను ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
మంగపేట మార్చి 5: రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన చలమల్ల కిరణ్, బొల్లెబోయిన అజయ్ ఇద్దరు మిత్రులు. ప్రస్తుతం గ్రామంలోని కేసీఆర్‌కాలనీలో ఎదురెదురుగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివాసం ఉంటున్నారు. గతంలో గ్రామంలో వేర్వేరు చోట ఉండేవారు. ఆరు నెలల క్రితం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక వీరికి ఎదురెదురుగా ఉన్న ఇండ్లు కేటాయించారు. అప్పటినుంచి వీళ్లిద్దరు స్నేహంగా ఉంటున్నారు. అజయ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి, కిరణ్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ కలిసి తిరిగే వీళ్లు.. చివరికి మృత్యువులోనూ కలిసేపోయారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.