హనుమకొండ చౌరస్తా, మార్చి 5 : ప్రభుత్వం తరుఫున నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(ఇండోర్ స్టేడియం)లో రాష్ట్ర సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్, హైదరాబాద్ ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సహకారంతో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. 38 కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 5 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
హైదరాబాద్, వరంగల్‌లో ఉద్యోగావకాశాలు కల్పించారు. జాబ్‌మేళాను ఎమ్మెల్సీ సిరికొండ సందర్శించి మాట్లాడుతూ.. అనేక సంస్థలు ఇందులో పాల్గొని అర్హులైన వారిని ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పారు. మెడికల్ రంగంలో రూ.40 వేల నెలసరి వేతనంతో ఉద్యోగం పొందిన సుమలతకు మధుసూదనాచారి నియామక పత్రం అందజేశారు. అలాగే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. ఒకేసారి 2 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారని డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ అన్నారు.