
బచ్చన్నపేట, నవంబర్ 14 : గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నది. గతంలో పలుచోట్ల జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఉపాధి హామీలో చేపట్టే ప్రతి పనికి సంబంధించి మూడు ఫొటోలు తప్పనిసరిగా తీయాలన్నది నిబంధన. సామాజిక తనిఖీల్లో వస్తున్న అభ్యంతరాలు, ఆరోపణలు ఇకపై రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూలీలు ఎక్కడ, ఏయే ప్రాంతంలో పని చేస్తున్నారనే ఫొటోలు తీయాలని ఆదేశాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో ఈ కండీషన్ పెట్టింది. పని ప్రదేశంలో ప్రారంభానికి ముందు, పనులు జరుగుతున్నప్పుడు, పనులు పూర్తయ్యాక మూడు రకాల ఫొటోలు తీయాలి. తర్వాత ఈ మూడు ఫొటోలను జతచేయాలి. జనగామ జిల్లాలో 12 మండలాల్లో 1,22,213 లక్షల జాబ్‌కార్డులుండగా, ఈ ఏడాదిలో 6513 పనులు జరిగాయి. ఇందుకోసం రూ.74. 28 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పనులకు సంబంధించి ఫొటోలు తీయని టీఏకు జరిమానా సైతం విధించే అవకాశాలున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
పకడ్బందీగా ఉపాధి అమలు
జిల్లాలోని 281 గ్రామ పంచాయతీల్లో జాతీయ ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. ప్రధానంగా గ్రామాల్లో ఫాంపాండ్లు, వ్యవసాయ బావుల వద్దకు మట్టి రోడ్లు వేసున్నారు. భూమి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారు. మరోవైపు రహదారులకు ఇరువైపులా కూలీలతో మొక్కలు నాటించడం, గుట్టలపై కందకాలు, శ్మశానవాటికలు, చేపల చెరువులు, డంపింగ్‌యార్డులు, ఇంకుడు గుంతలు, కల్లాలు, హరితహారం, పల్లెప్రకృతి వనాలు, నర్సరీల్లో పనులు చేయించడం, మామిడి తోటల ఏర్పాటు వంటి పనులకు అవకాశం కల్పించారు. దీంతో ఆయా మండలాల్లో ఇప్పటివరకు 6,105 కుటుంబాలు వంద రోజుల పనులు పూర్తి చేశారు. మరోవైపు రోజుకు ఒక్కో కూలికి రూ.168 నుంచి రూ.194 వరకు అందజేస్తున్నారు.
కూలి మంచిగ ఇస్తున్నరు..
ఉపాధి హమీలో పనులు దొరుకుతున్నయ్. దీంతో మాకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పినయ్. గ్రామాల్లో భూమి లెవల్ చేసుడు, మొక్కలు నాటుడు, నర్సరీలో పని, ఫాంపాండ్ పనులు చేస్తున్నం. కూలి అయితే మంచిగనే ఇస్తున్నరు. పని లేనప్పుడు వ్యవసాయ పనులకు పోతున్నం.