
సంగెం, నవంబర్ 14: అనాథ పిల్లలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని జిల్లా బాలల సంరక్షణ అధికారులు ధైర్యం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు ఆదివారం వారిని కలిసి భరోసా కల్పించారు. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన దేవులపెల్లి అశోక్ భార్య విద్యాంగురాలు. దీనికితోడు అనారోగ్య కారణాల వల్ల రెండు కళ్లు పోయాయి. ఇద్దరు పిల్లల పోషణ భారమై, భార్యకు సపర్యలు చేయలేక మనస్తాపంతో ఇటీవల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసానిచ్చారు. కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. పిల్లల విద్య, వసతి విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కే వసుధ, సభ్యులు బీ రామలీల, ప్రొటెక్షన్ అధికారి డీ రాజు పాల్గొన్నారు.