
ఏటూరునాగారం, నవంబర్ 19: జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, కళాశాలు, హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా ఉన్న కృష్ణ ఆదిత్య ఈ మేరకు పాఠశాలల నిర్వహణపై ఆరా తీసేందుకు ఆరుగురు ప్రత్యేకాధికారులను నియమించి తనిఖీలతో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో పాఠశాలల్లో పరిపాలన తీరు మారుతోంది. నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదోనని తనిఖీలు చేపడుతున్నారు. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బడులు సరిగా తెరవకపోవడంతో చదువులు కాస్త వెనుకబడిపోయాయి. దీంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించారు. జిల్లాలో 45 వరకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, కళాశాలలు ఉన్నాయి. గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిత్యం పాఠశాలలను సందర్శిస్తున్నారు. ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏవో దామోదర్‌స్వామి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, పీఏవో లక్ష్మీ ప్రసన్న, పీఈటీసీ ప్రిన్సిపాల్ వెంకన్నలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. పాఠశాలల్లో తనిఖీ వివరాలను కలెక్టర్ జారీ చేసిన చెక్‌లిస్టులో నమోదు చేస్తున్నారు. ఇటీవలె మొదటి విడుతగా తనిఖీ చేసిన క్రమంలో పలు లోటు పాట్లను అధికారులు గుర్తించారు. కొన్ని బడుల్లో నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు వెలుగుచూసింది. ఒక పాఠశాలలో నీళ్ల చారు పోస్తున్నట్లు బహిర్గతమైంది. మరొక పాఠశాలలో రెండున్నర కేజీల పప్పు కూరకు బదులు కేజీ మాత్రమే వండినట్లు వెల్లడైంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం ఏమిటీ, స్వచ్ఛమైన తాగు నీటి కోసం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పలు చోట్ల పనిచేయకపోవడం, చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో నిర్లక్ష్యం, విధులు నిర్వర్తించడంలో అలసత్వం, విధులకు డుమ్మా కొట్టడం లాంటివి గుర్తించారు. ఏటూరునాగారంలోని ఒక హాస్టల్లో ఇప్పటి వరకు నిత్యావర సరుకులు సరఫరా కాకపోవడంతో మార్కెట్లో ప్రైవేటుగా కొంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే పది మంది ఉపాధ్యాయులకు వివిధ కారణాలతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇద్దరు ప్రధానోపాధ్యాయులను కూడా బాధ్యతలను తప్పించినట్లు సమాచారం. ఒక ఉపాధ్యాయుడి జీతం కోత పెట్టి వివరణ కోరినట్లు తెలుస్తున్నది. కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు లేకపోవడం, విద్యార్థులు తక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.
వసతి సౌకర్యాలపై ఆరా
పాఠశాలల్లో వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి. తాగునీటి వనరులు ఏమిటి, ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులకు నీటి సరఫరా, శుభ్రం చేయడం, బోర్లు అందుబాటులో ఉన్నాయా అనే వివరాలను ప్రత్యేకాధికారులు నమోదు చేస్తున్నారు. తరగతి గదులు, డైనింగ్ హాలు, డార్మేటరీ, టాయిలెట్స్ కండిషన్లో ఉన్నాయో, విద్యుత్ సౌకర్యం, సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఉన్నాయా.. ఎలా పనిచేస్తున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
ఉపాధ్యాయుల విధుల నిర్వహణే కీలకం
పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు టీచర్స్ విధుల నిర్వహణలో ఎలా వ్యవరిస్తున్నారు. బడికి సరిగా వస్తున్నారా? డుమ్మ కొడుతున్నారా, సిలబస్ ప్లానింగ్ ఎలా చేస్తున్నారు, ఉపాధ్యాయులు తమ డైరీని అమలు చేస్తున్నారా, ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు బోధిస్తున్నారా, విద్యార్థులు లాంగ్వేజ్ రైటింగ్ ప్రాక్టిస్ చేస్తున్నారా, స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను తనిఖీల్లో అధికారులు సేకరిస్తున్నారు.
మెనూ పరిస్థితి ఏమిటీ?
నాణ్యమైన విద్యతోపాటు భోజనం సమయానికి అందిస్తున్నారా లేదో తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం మూడు నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ. 950లు, 8 నుంచి 10వ తరగతి వరకు రూ. 1150, ఇంటర్ ఆపై విద్యార్థులకు నెలకు రూ.1500 చొప్పున గిరిజన సంక్షేమశాఖ కేటాయించింది. వీటికి అనుగుణంగా మెనూ అమలుకు నోచుకుంటా లేదో ఆరా తీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూనిఫాంలు, కార్పెట్లు, బెడ్స్, కాస్మోటిక్స్ అందాయా లేదో తెలుసుకున్నారు.
రెండో విడుత తనిఖీలు షురూ
ఇక మొదటి విడుత తనిఖీలు పూర్తి కావడంతో రెండో విడుత తనిఖీలకు అధికారులు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. మొదటి విడుత తనిఖీల అనంతరం లోటు పాట్లు సరిదిద్దబడితున్నాయా, లేదా అనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకాధికారులు పాఠశాలలు సందర్శించిన వెంటనే వివరాలను కలెక్టర్‌కు వాట్సప్‌లో చేరవేస్తున్నారు. కొన్నింటిపై కలెక్టర్ తక్షణమే స్పందిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారుల తనిఖీలు మొదలు కావడంతో పాఠశాలల నిర్వహణపై మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.