
తాడ్వాయి, నవంబర్21: ప్రత్యేక గొట్టు, గోత్రాలు, ఆచారాలు కలిగి ఉన్న ఆదివాసీల జాతరలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ యుతపై ఉందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్‌కుమార్ అన్నారు. కామారంలో ఆదివారం బిర్సాముండా యూత్ అధ్యక్షుడు రేగ రాజశేఖర్ అధ్యక్షతన కోయతూర్ వేల్పుల జాతరల రక్షణకు చత్తీస్గడ్, తెలంగాణ రాష్ర్టాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రెండు రాష్ర్టాల నుంచి సుమారు 300 మంది ఆదివాసీలు, 57 కోయతూర్ వేల్పుల జాతర స్థలాల నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడారు. కోయతూర్‌ల చరిత్ర క్రీస్తుపూర్వం ఐదు లక్షల సంవత్సరాల నాటిదని, ఆదివాసీలను 1వ గొట్టు నుంచి 12వ గొట్టు వరకు ఏర్పాటు చేసి ఈవంశంలో తొలి ఆడబిడ్డ, తల్లిదండ్రులను దైవాలుగా కొలుస్తూ వేల్పుల రూపంలో నేటికీ జూలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక గొట్టు, గోత్రాలు, ఆచారాలు కలిగి ఉన్న జాతరలపై పాలకులు చిన్నచూపు చూడడంతో తమ జాతరలు అంతరించిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాలక్రమేనా ఆదివాసీలు హిందూ దేవతలను కొలుస్తూ, క్రైస్తవ మతంలోకి మారుతూ కోయతూర్ దేవతలను మరిచిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆదివాసీలు పూర్వ కాలంనాటి జాతరలను నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంతోష్‌కుమార్, రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కాక నర్సింగరావు, కోయతూర్ సిద్దాంతకర్తలు తాటి వెంకటేశ్వర్లు, చందా వీరయ్య, బీజాపూర్ కోయ సమాజ బాధ్యులు యాలం తులసీరామ్, గ్రామపెద్దలు హన్మంతరావు, దయాకర్, భుజంగరావు, రవి తదితరులు పాల్గొన్నారు.