ఖానాపురం, నవంబర్ 16: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆయన ఖానాపురంలోని పీహెచ్‌సీతోపాటు సబ్‌సెంటర్, రాగంపేటలో టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్‌లో 4,82,302 మందికి వ్యాక్సిన్ వేయాలని గుర్తించామన్నారు. ఇందులో మొదటి డోసు 3,62,364 మందికి, రెండో డోసు 1,28,471 మందికి వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 291 హ్యాబిటేషన్లలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి టీకాలు వేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో పర్వతగిరి, గీసుగొండ మండలాలు వ్యాక్సినేషన్లో వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వందశాతం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్, ఏఎన్ఎం సునీత, సీసీ జమాల్, సూపర్వైజర్ శ్రీలత, రామలింగయ్య, ఆశ వర్కర్లు సుమలత, సులోచన, సిబ్బంది భద్రునాయక్, భాస్కర్, వెంకటేశ్, కేర్ ఇండియా మొబిలైజర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది అర్హులకు టీకాలు వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 1202 మందికి మొదటి డోసు, 2436 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేశారన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి
నల్లబెల్లి/పర్వతగిరి: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని ఎంపీడీవో కూచన ప్రకాశ్ కోరారు. నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామ పంచాయతీ, కార్యాలయం, సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి రహీం పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని మూడెత్తులతండాలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ పరిశీలించారు. ప్రజలు అపోహలకు గురికాకుండా టీకాలు వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖర్జీ, కేర్ ఇండియా మొబిలైజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.