
సింగరేణిలో ఉద్యోగం ఓ వరం. సంస్థ ఉత్పత్తిలో కార్మికులే కీలకం. నిత్యం విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి చేస్తేనే సంస్థ, కార్మిక కుటుంబాలకు మనుగడ. అలాంటి చోట కొందరు అదే పనిగా విధులకు డుమ్మా కొడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక కష్టాలు ఎక్కువై. ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదికి వంద మస్టర్లు తప్పనిసరి అని యాజమాన్యం మొత్తుకుంటున్నా, కొందరు పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తూ, డ్యూటీకి రావాలని కోరుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు.
సింగరేణిలో విధులు సక్రమంగా నిర్వహించిన వారికి వేతనాలు బాగానే వస్తాయి. కొందరు మాత్రం వ్యసనాలకు అలవాటు పడి, ఉద్యోగం చేయలేక తరచూ గైర్హాజరవుతున్నారు. ఈ కారణంగా వేతనం తక్కువగా పొందుతున్నారు. దీంతో కుటుంబాల్లో కష్టాలు తప్పడం లేదు. సింగరేణి సంస్థలో ఏడాదికి వంద మస్టర్ల కంటే తక్కువ చేసే ప్రతి ఉద్యోగికీ, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కొందరు కార్మికుల్లో పరివర్తన వస్తుండగా, మరికొందరు మాత్రం అదే పనిగా డుమ్మా కొడుతూ ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. మద్యం, పేకాట, గంజాయి వంటి వాటికి బానిసలై తమ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. 2020లో బియాని సునీల్, 2021లో అక్టోబర్ వరకు కొరి కమలకుమార్(253) ఏరియాలోనే అత్యధిక మస్టర్లు చేశారు.
ఆరోగ్యం సహకరించింది..
2020లో అత్యధికంగా ఏరియాలోనే అందరికంటే 299 మస్టర్లు చేశాను. ఆరోగ్యం సహకరించడం, నా భార్య ఉష తోడ్పాటును అందించడం వల్లే ఇది సాధ్యమైంది. అధికారులు కూడా ఎంతో ప్రోత్సహించారు. ఎక్కువ మస్టర్లు చేయడం వల్ల అత్యధిక వేతనం వస్తుంది. ఆర్థికంగా బలపడతాం. కంపెనీకి బొగ్గు ఉత్పత్తి పెంపునకు సహకరించిన వారమవుతాం. తోటి ఉద్యోగులు, అధికారుల నుంచి అభినందనలు వస్తాయి. 2005లో సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన మూడేండ్లు మినహా ఏటా 290 మస్టర్ల పైనే చేస్తూ వస్తున్నా. అత్యధిక మస్టర్లు చేసినందుకు 2019లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా యాజమాన్యం ఘనంగా సన్మానించింది. 2019లో 303 మస్టర్లు చేశాను.
-బియాని సునీల్, కోల్కట్టర్, కేటీకే 6 (భూపాలపల్లి ఏరియా )
నెలకు కనీసం 20 మస్టర్లు చేయాలి
ప్రతి ఉద్యోగి నెలకు కనీసం 20 మస్టర్లు చేయాలి. ఏటా వంద మస్టర్ల లోపు ఉన్న కార్మికులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఈ యేడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు ఒక మస్టరు కూడా చేయని వారు ఏరియాలో 34 మంది ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) చంద్రశేఖర్ ఆదేశాల మేరకు వీరికి ఈ నెల 9న స్థానిక సీఈఆర్ క్లబ్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. వీరందరికీ నోటీసులు ఇచ్చాం. గతేడాది వంద మస్టర్లు చేయని వారికి గనుల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు 80 మస్టర్ల లోపు చేసిన కార్మికులకు కూడా దఫాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం.
-అజ్మీరా తుకారాం (పర్సనల్ మేనేజర్) భూపాలపల్లి ఏరియా
విధులకు హాజరైతే చేకూరే ప్రయోజనాలు
విధులు సక్రమంగా నిర్వహిస్తే వేతనం సవ్యంగా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు.
కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబ పోషణ, పిల్లలకు ఫీజులు, ఇతరాత్ర అన్ని సౌకర్యాలు ఏర్పడుతాయి.
విధులు నిర్వహించకుంటే..
విధులకు డుమ్మా కొట్టడంతో వచ్చిన తక్కువ వేతనం ఏటూ సరిపోదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అప్పులు చేస్తారు.
విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల సంస్థపై కూడా దీని ప్రభావం పడుతుంది.