
ఏటూరునాగారం, నవంబర్ 3 : 2006 సంవత్సరం కంటే ముందు నుంచి పోడు భూములు సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాలు రాకుంటే గ్రామ స్థాయి ఎఫ్ఆర్సీ కమిటీలకు తమ దరఖాస్తులను అందించాలని గిరిజన సంక్షేశాఖ జాయింట్ డైరెక్టర్, ఓఎస్డీ అలీం కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో అటవీహక్కుల చట్టం, హక్కు పత్రాలు పొందడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజనులకు అహగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ శ్యామల, అసిస్టెంట్ మ్యూజియం క్యూరేటర్ శైలజ, పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీం, ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ హక్కుపత్రాలు మంజూరు చేయడంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. కొత్తగా ఫారెస్టు రైట్ కమిటీలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలో దరఖాస్తులను అందజేయాలన్నారు. ఈనెల 8లోగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 8లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. గ్రామ, సబ్ డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందాల్సి ఉంటుందని, అటవీశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే చేస్తారని తెలిపారు. అటవీ హక్కుల చట్టంపై ఉన్న సందేహాలు, అటవీశాఖ అధికారుల దాడులపై తుడుందెబ్బ, మన్యసీమ సంఘం రాష్ట్ర నాయకులు పొడెం రత్నం, గొప్ప వీరయ్య, గొంది నాగేశ్వర్రావు, ఎల్లబోయిన రాంబాబు, మడే సాయిబాబా మాట్లాడారు. 1950 గెజిట్ ప్రకారం రెవెన్యూ, ఫారెస్టు భూమి ఎంతో ఉందో దాని ప్రకారం హక్కుపత్రాలు జారీ చేయాలని పంబాపూర్ సర్పంచ్ రాంబాబు కోరారు. అటవీశాఖ అధికారులు గ్రామాల చుట్టూ కందకాలు తీస్తున్నారని, అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు రత్నం అధికారుల దృష్టికి తీసుకపోయారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు సుమారు 300 మంది వరకు పాల్గొన్నారు.