
పెద్దవంగర, నవంబర్ 02 : దేశంలో తపాలాశాఖ రోజురోజుకూ తన సేవలను విస్తరిస్తున్నది. ఒకప్పుడు కేవలం ఉత్తరాల బట్వాడ, మనియార్డర్ వంటి సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు ప్రసుతం బ్యాంకులతో సమానంగా పోటీ పడుతున్నాయి. ఒకచోట ఖాతా ప్రారంభిస్తే దేశంలో ఎక్కడి నుంచైనా నిర్వహించుకునే సదుపాయాలు ఉన్నాయి. ఓటరు కార్డు, ఆధార్ కార్డు సేవలతోపాటు బ్యాంకుల్లో మాదిరిగా ఏటీఎం కార్డులను అంబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తున్నది. ఇవేకాక ప్రజలకోసం అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్…
దీని కాలపరిమితి 15 ఏళ్లు. ప్రతినెలా రూ.500 జమ చేయాలి. వార్షిక వడ్డీ 7.90శాతం చెల్లిస్తారు. 18ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు ఇందులో చేరవచ్చు.
పోస్టాఫీస్ పొదుపు పథకం..
ఈ పథకంలో చేరితే కేవలం రూ.20లతో ఖాతా ప్రారంభిస్తారు. చెక్‌బుక్ కావాలంటే అదనంగా రూ.500 చెల్లించాలి. చెక్‌బుక్ వద్దనుకుంటే కేవలం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఖాతా తెరుస్తారు. కాల పరిమితి, డబ్బు పరిమితి ఉండదు. నాలుగు శాతం వార్షిక వడ్డీని ఈ పథకం ద్వారా పొందవచ్చు.
నెలవారీ ఆదాయ పథకం..
ఒక్కరు లేదా ఇద్దరు కలిసి ఈ పథకంలో చేరవచ్చు. ఒకరైతే గరిష్ఠంగా రూ.4.50లక్షలు , ఇద్దరు అయితే రూ.9లక్షల వరకు పొదుపు చేయొచ్చు. వార్షిక వడ్డీ 7.60శాతం చెల్లిస్తారు. ఏడాది తర్వాత విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. నెలనెలా వడ్డీ మొత్తాన్ని పోస్టల్ ఖాతా ద్వారా పొందవచ్చు.
పోస్టాఫీస్ టైం డిపాజిట్ పథకం..
ఈ పథకంలో కేవలం రూ.200తో ఖాతాను ప్రారంభించాలి. కాల పరిమితి ఆధారంగా వడ్డీరేటు మారుతుంది. మూడు నెలలకోసారి వడ్డీని ఖాతాలో జమచేస్తారు. కాల పరిమితి 5ఏళ్లు నిండిన తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా కొనసాగించవచ్చు. ఈ పథకంలో ఖాతాను జాయింట్‌గా కొనసాగించే అవకాశం ఉంది.
రికరింగ్ డిపాజిట్ పథకం..
కనీసం రూ.10లతో ఖాతాను ప్రారంభించాలి. రూ.5 నుంచి ఎంతైనా పొదుపు చేయొచ్చు. నామినీ సౌకర్యం కూడా ఉంది. ఏడాది పాటు పొదుపు చేస్తే 50శాతం అడ్వాన్స్‌గా తీసుకునే సదుపాయం ఉంది. వార్షిక వడ్డీ 7.2శాతాన్ని జమచేస్తారు. కాల పరిమితి ఐదేళ్లు. ఆ తర్వాత కొనసాగించవచ్చు.
కిసాన్ వికాస్ పత్రం..
వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా సొమ్మును ఈ పథకంలో పొదుపు చేయవచ్చు. 7.60శాతం వడ్డీ చెల్లిస్తారు. కాల పరిమితి 9సంవత్సరాల 5నెలలు(113 నెలలు). పొదుపు చేసిన సొమ్ము రెండింతలై చేతికొస్తుంది. నామినీ సౌకర్యం ఉంటుంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు మార్చుకోవచ్చు.
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన..
కాల పరిమితి ఏడాది. ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవచ్చు. పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉండి 18నుంచి 70ఏళ్ల వయసు ఉన్న ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.రెండు లక్షలు, పూర్తి అవయవ నష్టానికి రూ.2లక్షలు, పాక్షిక అవయవ నష్టానికి రూ.లక్ష అందజేస్తారు. ఏడాదికి రూ.12ప్రీమియం చెల్లిస్తే ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తారు.
సుకన్య సమృద్ధి యోజన..
10ఏళ్లు నిండిన బాలికలు ఉన్న తల్లిదండ్రులు ఈ పథకానికి అర్హులు. కనీసం రూ.1000లతో ఖాతాను ప్రారంభించాలి. గరిష్ఠంగా రూ.1.50లక్షలు జమ చేయవచ్చు. ఏడాదిలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాలి. వార్షిక వడ్డీ 8.40శాతం చెల్లిస్తారు. ఒకవేళ ఖాతా మధ్యలో ఆగిపోతే రూ. 50 అపరాధ రుసుము కట్టి పునరుద్ధరించవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత పై చదువుల కోసం, 21 ఏళ్లు నిండిన తర్వాత వివాహనికి మాత్రమే అందజేస్తారు.
అటల్ పింఛన్ యోజన..
పేద కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 18నుంచి 40ఏళ్ల మధ్య వయసు ఉన్న భారతీయులు అర్హులు. 18 ఏళ్ల వయసు ఉన్న కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్ రావాలంటే నెలకు కనీసం రూ.42చొప్పున ప్రీమియం చెల్లించాలి. నెలవారీ పింఛన్ రూ.5వేలు పొందాలంటే 18ఏళ్ల వ్యక్తి నెలకు రూ.210 చెల్లించాలి. 40ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరి నెలకు రూ.1000 పింఛన్ పొందాలంటే నెలకు రూ.291 ప్రీమియం చెల్లించాలి. ఇలా అనేక పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎలాంటి భయం ఉండదు. భద్రతకు భరోసా ఉంటుంది. నేటి పొదుపు..రేపటి మదపు అన్న విషయం అందరికీ తెలిసిందే.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..
ఖాతాను రూ.100లతో ప్రారంభించాలి. ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఆదాయ పన్ను 80సీ ప్రకారం ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో మేలైన పథకం. వార్షిక వడ్డీ రేటు 7.9శాతం. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చు. నామినీ సౌకర్యం ఉంటుంది.