
హనుమకొండ, నవంబర్ 2 : గత నెల 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు 42 రోజులు హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి తద్వారా ప్రజలకు న్యాయ సేవ అధికార సంస్థల అవసరాలు, న్యాయసేవాధికార సంస్థ లక్ష్యాలను తెలియజేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి యార రేణుక తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) ఆదేశాల మేరకు ‘పాన్ ఇండియా అవేర్నెస్.. ఔట్రీచ్ క్యాంపెయిన్’ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో భాగంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు 42 రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలతో సహా మొత్తం 1,688 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ సంక్షేమ పథకాలు అందేలా న్యాయ సేవ అధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ అధికారుల వల్లే ప్రజలకు న్యాయం జరిగేలా సహకరించవచ్చని సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్, డీసీపీ పుష్ప, జిల్లా అధికారులు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.