రామారెడ్డి, డిసెంబర్ 25: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని దూషణలు భరించలేక వార్డు ప్రజ లు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్‌డ్రింక్స్, బొందిప్యాకెట్లను తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఉప్పల్వాయి గ్రామంలో మొదటి విడుతలో జరిగిన ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థిని స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సదరు అభ్యర్థి పోలింగ్‌కు ముందు తన వార్డులో ఇంటింటికీ చీరలు, మద్యం బా టిళ్లు, కూల్‌డ్రింక్స్, బొందిప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో తన వార్డు ప్రజలు కనిపించినప్పుడల్లా వారిని అసభ్యపదజాలంతో దుర్భాషలాడేవారు.
దీంతో విసిగిపోయిన గ్రామపెద్దలతోపాటు వార్డు ప్రజలు ఓడిపోయిన అభ్యర్థినిని పం చాయతీ ఆవరణకు గురువారం పిలిపించారు. దుర్భాషలాడడం కరెక్ట్ కాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని కొంతమంది పెద్దమనుషులు ఆమెకు సూచించగా, ఆమె ససేమిరా అన్నా రు. దీంతో వార్డు ప్రజలు ‘నీ తిట్లు వద్దు..నీ వస్తువులు మాకొద్దు ..’ అంటూ ఎన్నికల్లో ఆమె పంపిణీ చేసిన చీరలు, బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్‌ను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉంచారు. వాటిని తీసుకొని వెళ్లాలని ఓడిపోయిన అభ్యర్థికి సూచించగా ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అభ్యర్థితోపాటు గ్రామస్తులను సముదాయించారు.