నిజామాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మరోసారి తెరమీదికి వచ్చింది. మొన్నటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, పార్టీ పదవులు ఆశించి భంగపడిన వారంతా ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవుల కోసం కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాత తరం నేతలు, కొత్తగా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో బహిరంగంగానే ఘర్షణ జరుగుతోందని సమాచారం. నుడా ఛైర్మన్ నియామకం జరిగి నెలలు గడుస్తున్న ఏ కారణంతో డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. నుడాలో చోటు కోసం చాలా మంది ఆశావాహులు హైదరాబాద్‌కు వరుస కడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులతో పాటుగా మంత్రులు, ఇతర ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13 మంది డైరెక్టర్ల నియామకానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుడా పరిధిని దాదాపుగా జిల్లా అంతటికీ విస్తరించింది. ఈ పరిస్థితిలో డైరెక్టర్ల పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది. నుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం నుడా నిజామాబాద్ జిల్లా అంతటా ఉండటంతో ఆశావాహులు కూడా అదే స్థాయిలో విస్తరించారు. గతంలో నుడా అంటే నిజామాబాద్ నగరానికి సంబంధించిన వ్యవహారంగా ఉండేది. కానిప్పుడు పరిధి విస్తృతితో ఆశావాహుల సంఖ్య రెట్టింపు కాగా కాంగ్రెస్ పార్టీలో కొత్తరకమైన చిచ్చు రాజుకుంటోందని చర్చ నడుస్తోంది.
నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నుడా పరిధిలో 13 మండలాలను తీసుకొచ్చి మొత్తం 83 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకు వచ్చారు. డైరెక్టర్లుగా 13 మందికి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుడా పరిధిని నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలకు దాదాపుగా విస్తరించింది. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 383 గ్రామాలను చేర్చింది. ఈ గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులతో పాటు నిర్మాణాలు, మౌళిక వసతులను కల్పించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టనున్నారు. ప్రజలకు అవసరమైన మౌళిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ఈ పరిధిని పెంచిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేసేందుకు నుడా పరోక్షంగా అధికార కేంద్రంగా మారబోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. నుడా పరిధిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వమే ఛైర్మన్‌గా కేశ వేణును నియమించి డైరెక్టర్ల నియామకాన్ని పక్కన పెట్టింది. ఏడాదికి పైగా కేశ వేణు ఒక్కడే ఈ పదవిలో రాజసం పొందుతున్నాడు. డైరెక్టర్లు లేకపోవడంతో నుడాలో తిరుగులేని శక్తిగా ఏక ఛత్రాధిపత్యంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నుడా పాలకవర్గంలో డైరెక్టర్లు ఉండటం వల్ల పారదర్శకంగా నిర్ణయాలు వెలువడేందుకు అవకాశాలుంటాయి. 33 మండలాల్లోని గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకు రావడం వల్ల డైరెక్టర్ల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అధికార దర్పం ఎక్కడ చేజారుతుందోనన్న భయాందోళనతో నుడా విస్తరణను అపహాస్యం చేసేలా కొంత మంది వ్యవహారం నడుస్తోందన్న చర్చ మొదలైంది.
నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)కు వెంచర్ల ఏర్పాటు, మౌళిక సదుపాయాల కల్పనలో బాధ్యతలు ఉన్నాయి. కీలకమైన వెంచర్ల ఏర్పాటులో తమ నేతలే క్రియాశీలకంగా మారితే తమకు ఇబ్బందులు తప్పవనే సాకుతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నేతలు కూడా కింది స్థాయి నేతలను ఎదగనివ్వకుండా తొక్కి పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఇబ్బంది పడుతోన్న వారంతా నామినేటెడ్ పోస్టుల వైపే కన్నేశారు. కానీ వీరికి నేతల సపోర్ట్ దక్కకపోవడంతో రగిలి పోతున్నారు.
మొన్నీ మధ్యే అంతర్గత పార్టీ సమావేశంలోనూ ఓ కీలక నాయకుడిని కొంత మంది నిజామాబాద్‌కు చెందిన నేతలు నిలదీసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మీరే పదవులు అనుభవిస్తారా…? మాకు పదవులు వద్దా…? అంటూ ప్రశ్నించినట్లుగా సమాచారం. ఈ పరిణామాలతో నేతల మధ్య దూరం మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌కు నుడా డైరెక్టర్ల భర్తీపై పలువురు విన్నపాలు అందుతున్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల సిఫార్సులతోనే తన వద్దకు రావాలని సూచించడంతో కింది స్థాయి నాయకత్వం కినుక వహించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏడాది కిందటే నుడా డైరెక్టర్ల నియామకం జరగాల్సి ఉండగా నుడా ఛైర్మన్‌తో పాటుగా ఎమ్మెల్యేలు, కీలక నేతలే అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తమ చెప్పు చేతల్లో ఉంటోన్న లీడర్లకు పదవులు కట్టబెడితే మాట వినడం కష్టమేనన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటే ఎప్పుడే పూర్తయ్యే ప్రక్రియలో తాత్సారం జరగడంపై ద్వితీయ శ్రేణి నేతలంతా రగిలి పోతున్నారు.