
ఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలు.. 1271 మంది ఓటర్లుబరిలో ప్రధాన అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా.. కొవిడ్ నిబంధనలకు లోబడే పోలింగ్ ఏర్పాట్లు సామగ్రితో కేంద్రాలకు వెళ్లిన సిబ్బంది ప్రతి కేంద్రంలోనూ వెబ్‌కాస్టింగ్, వీడియో చిత్రీకరణ పోలింగ్ అనంతరం నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు ఉమ్మడి జిల్లాతో కూడిన నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గ పోలింగ్ శుక్రవారం జరుగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది గురువారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఏజెంట్ల నియామక ప్రక్రియ అనంతరం పోలింగ్ మొదలు కానున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తుండగా ప్రాధాన్యతా ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,271 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్9(నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఆర్డీఓ కేంద్రాలుగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఏ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే ఓటర్లు ఆ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్‌లోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికే ఓటర్లందరికీ సమాచారం అందజేశారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భువనగిరి, చౌటుప్పల్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఏడుగురు సిబ్బంది విధుల్లో ఉండే విధంగా నియామకం చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా తాసీల్దార్లు, ఏపీఓలుగా మున్సిపల్ కమిషనర్లు, ఓపీఓలుగా సూపరింటెండెంట్ స్థాయి అధికారులు వ్యవహరించునున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, ఇద్దరు ఓపీఓలు, మైక్రోఅబ్జర్వర్, వీడియో గ్రాఫర్, వెబ్ కాస్టింగ్ టెక్నిషియన్లు విధుల్లో ఉండనున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రం నుంచి నేరుగా నల్లగొండలోని ఆర్ఓ కార్యాలయం నుంచి పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు మరికొంత మందిని రిజర్వ్ సిబ్బందిని ఎంపిక చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడమే లక్ష్యమని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు.
విధులను సమర్థవంతంగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్
నీలగిరి, డిసెంబర్ 9 : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, అదనపు రిటర్నింగ్ అధికారి వనమాల చంద్రశేఖర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అధికారులు, ఓటర్లు సెల్ఫోన్లు తీసుకురాకుండా చూడాలని చెప్పారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి నేరుగా రిసెప్షన్ కేంద్రానికి తీసుకువచ్చి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, గోపీరాం, డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన..
జిల్లా సమాఖ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి వనమాల చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్‌రూమ్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఓటుసేప్పుడు జాగ్రత్త..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలువడంతో ఓటరు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. తాను ఎంచుకున్న అభ్యర్థి ఫొటో, పేరును జాగ్రత్తగా పరిశీలించి ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి. ప్రతి ఓటరు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే ఓటు చెల్లదు. తర్వాత ఎన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకోరు. ఒకటో ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఇతర అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయొచ్చు. మొత్తం ఏడుగురు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే స్వేచ్ఛ ఉంటుంది. ఓటు వేసే క్రమంలో ఎక్కడా ప్రాధాన్యత క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇంగ్లిష్ లేదా రోమన్ అంకెల్లో ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అందులో అంకెలు (1, 2, 3, 4… ఇలా)వాడడమే మేలు. రైట్ లేదా ఇతర గుర్తులు, చిహ్నాలు బ్యాలెట్ పేపర్ పైన రాస్తే ఓటు చెల్లదు. ఓటరు ఏవైనా అనుమానాలు ఉంటే పోలింగ్ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా..
కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో పాటు ఓటర్లంతా మాస్క్ ధరిస్తేనే లోపలికి అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. అదే విధంగా ఓటర్లు లైన్లో భౌతికదూరం పాటించేలా సర్కిల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే వారు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ అదనపు కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వనమాల చంద్రశేఖర్ వెల్లడించారు. పోలింగ్ ముగిశాక అన్ని చోట్ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను ప్రత్యేక బందోబస్తు నడుమ నల్లగొండలోని మహిళా ప్రాంగణంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు చేరవేస్తారు. అక్కడ అభ్యర్థులు లేదా వారి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేయనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.
ఏర్పాట్లు పూర్తి : ఆర్డీఓ
దేవరకొండ, డిసెంబర్ 9 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ గోపీరాం తెలిపారు. గురువారం ఎన్నికల సామగ్రిని స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేర్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పరిశీలించి మాట్లాడారు. పది మండలాల నుంచి 140 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. జడ్పీటీసీలు-10, మున్సిపల్ కౌన్సిలర్లు-20, ఎంపీటీసీలు-110 ఉన్నారన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు వీరే…
బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఓటింగ్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లో మొదటి అభ్యర్థ్ధిగా టీఆర్ఎస్కు చెందిన మంకెన కోటిరెడ్డి పేరు ఉండనుంది. తర్వాత స్వతంత్ర అభ్యర్థ్ధులైన కాసర్ల వెంకటేశ్వర్లు, రాంసింగ్ కొర్రా, బెజ్జం సైదులు, ఏర్పుల శ్రీశైలం, డాక్టర్ కె.నగేశ్, వంగూరి లక్ష్మయ్య పేర్లు, వారి ఫొటోలు వరుస క్రమంలో ఉండనున్నాయి. అయితే ప్రధాన పార్టీ నుంచి కోటిరెడ్డి ఒక్కరే బరిలో ఉండడం గమనార్హం. క టీఆర్ఎస్కు ఉన్న సంఖ్య బలం రీత్యా ఇతరులు నామ మాత్ర పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.