కోటగిరి : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9 వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9 వ తేదీన దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్నామని కార్మికులు ఆధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావచ్చిన ఇప్పటి వరకు కార్మిక సంక్షేమ బోర్డును నిర్వహించలేక పోవడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పనిని చేయాలని కార్మికులకు ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేసి కార్మిక చట్టాలను పునర్దించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నల్ల గంగాధర్, గుడాల రాములు, కప్ప హనుమాన్లు, దత్తు, గుడాల శివరాజ్ తదితరులు ఉన్నారు.