ముంబై: ఐపీఎల్లో అత్యధిక పరుగులు, శతకాలు వంటి రికార్డులు సృష్టించిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఈ మెగా లీగ్‌లో మరో ఘనత సాధించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం గడించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీతోనే ఉన్న విరాట్ ఇప్పటివరకు అందరికంటే ఎక్కువగా రూ. 230 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ‘ఫనాటిక్ స్పోర్ట్స్ – హరున్’ అనే సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కోహ్లీ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (రూ. 227.2 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 200 కోట్లు) నిలిచారు.
కాగా, లీగ్‌లోని మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల ఉమ్మడి విలువ ప్రస్తుతం రూ. 1.63 లక్షల కోట్లుగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో షారూఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 19,200 కోట్ల పైచిలుకు మొత్తంతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవగా.. ఐదేసి ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ (రూ. 18,400 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 18,400 కోట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత సగటు ఐపీఎల్ జట్టు విలువ 1.8 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 15 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.