సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ సేవా వాట్సప్, చాట్‌బాట్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించినట్లు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఒక ప్రకటన తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ అసెస్మెంట్ రివిజన్, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, బర్త్ హోం (ఇంటి దగ్గర పుట్టిన), డెత్ హోమ్ (ఇంటి దగ్గర చనిపోయిన), ప్రాపర్టీ డోర్ నంబరు సవరణ, ప్రాపర్టీ పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు, ట్రేడ్ లైసెన్స్ సేవలను వాట్సప్ మీ సేవలో చేర్చారు.
సేవలు పొందేందుకు 8096958096 నంబర్‌ను మొబైల్లో మీ సేవా తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోవాలని వివరించారు. అనంతరం వాట్సప్‌లో ఆ నంబర్‌కు హాయ్ అని సందేశం పంపాలి. అవసరమైన సేవ పేరు టైప్ చేసి, మెనూలో కనిపించే ఓపెన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తి చేసే దరఖాస్తు వెంటనే వాట్సప్ ద్వారా నమోదవుతుందని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పోలీస్ ఛలాన్, విద్యుత్ బిల్లు, బీఐఈ ఫలితాల సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.