ఒక్క తేనెటీగ కనిపిస్తేనే ఎక్కడ కుడుతుందో అన్న భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ, ఈ మహిళలు లక్షల తేనెటీగల మధ్య రోజును గడుపుతారు. ప్రేమతో పెంచితే అసలు అవి ఏమీ చేయవని, తమ ఒంటి మీద వాటిని ఎక్కించుకొని మరీ చూపించి చెబుతారు. వాటి పెంపకం ద్వారా ఆర్గానిక్ తేనెను ఉత్పత్తి చేస్తూ తమ జీవితాలలోనే కాదు చుట్టుపక్కల మహిళల జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్నారు. అటు ప్రకృతికీ తమ వంతు సాయం అందిస్తున్నారు. సంప్రదాయ తెరలను తొలగించి ఒకరు, ఇంటి బరువును భుజాన వేసుకుని మరొకరు, గిరిజనులకు బాసటగా నిలుస్తూ ఇంకొకరు… ఇలా ఈ ఇండియన్ బీ క్వీన్లు ఒక్కొక్కరిది ఒక్కో విజయ గాథ!
కశ్మీర్ లోయల్లో ఉదయం మబ్బులు ఇంకా చెట్ల కొమ్మలను విడిచి వెళ్లని వేళ… పూల తోటలపై తేనెటీగల గుంపులు మృదువుగా గుసగుసలాడుతుంటాయి. ఆ చప్పుడులోనే తన భవిష్యత్తు స్వరాన్ని విన్న యువతి.. సానియా జెహ్రా. పెద్దగా గుర్తింపు లేని ఒక చిన్న రంగాన్ని ఆశగా చూసిన ఆమె తన కలల్ని నిజం చేసుకుంది.
కశ్మీర్‌లోని బల్హామా ప్రాంతానికి చెందిన సానియా తొలుత మెడిసిన్ చదవాలని అనుకుంది. అయితే వాళ్ల కుటుంబం చిన్న స్థాయిలో చేస్తున్న తేనెటీగల పెంపకం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. కశ్మీర్ లాంటి ప్రాంతంలో, అందులోనూ వీళ్లకు సంబంధించిన కుటుంబాల్లో ఆడవాళ్లు ఇలాంటి విభిన్నమైన పనుల్లో ముందుకు రావడం అనేది అరుదైన విషయం. అయినా సరే ఆమె తన ఆసక్తిని వదులుకోలేదు. తండ్రితో కలిసి ఎన్నో ప్రాంతాలు, రకరకాల అడవులు తిరుగుతూ తేనెటీగల జీవన విధానాన్ని తెలుసుకుంది. ప్రతిరోజూ కొన్ని గంటల పాటు వాటి మధ్య గడిపేది. అలా తమ దగ్గర ఉన్న 35 తేనెటీగల కాలనీలను ఏకంగా 650 కాలనీలుగా మార్చింది.

ప్రస్తుతం ఆమె ఏడాదికి వెయ్యి కిలోల తేనెను ఉత్పత్తి చేస్తున్నది. ఈ పని ద్వారా ఆ చుట్టు పక్కల ఉన్న ఎంతోమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా తేనె అందించాలన్న ఉద్దేశంతో కశ్మీర్‌లోని కఠినమైన చలికాలంలో తేనెటీగల గూళ్లను ఏటా రాజస్థాన్‌లోని గంగాపూర్‌కి తరలిస్తుంది. చలికాలంలో తేనెటీగలు మంచి తేనెను ఉత్పత్తి చేసేందుకు అక్కడి వాతావరణం సహకరిస్తుంది. నిజానికి ఇది ఎంతో కష్టసాధ్యమైన పని. అయినా, మంచి తేనె ఉత్పత్తి కోసం ఈ మార్గం మేలైనదని ఆమె అంటుంది.
కశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్స్ పేరిట 20 ఏళ్లకే ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం తేనె మాత్రమే కాకుండా తేనెటీగల పెంపకం ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులతో రాయల్ జెల్లీ, బీ పోలెన్, గ్రీన్ పోలెన్తో పాటు రకరకాల సౌందర్య ఉత్పత్తులను కూడా తయారు చేసి దేశ విదేశాల్లో అమ్ముతున్నది. ముఖ్యంగా రసాయన రహిత, ఆర్గానిక్ ఉత్పత్తులు కావడంతో ఆమె బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తొలుత మధ్యవర్తుల సహాయంతో వ్యాపారం చేసినా… అక్కడ కల్తీ జరుగుతుందని తెలుసుకుని నేరుగా విక్రయించడం ప్రారంభించింది.
స్థానిక మార్కెట్లో అమ్మకాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంది. దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలకు కూడా ఆమె ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సానియా విజయం అంతటితో ఆగిపోలేదు. గ్రామీణ మహిళలకు బీ-కీపింగ్‌పై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఆమె వద్ద శిక్షణ పొందిన అనేకమంది మహిళలు ప్రస్తుతం స్వంతంగా తేనె ఉత్పత్తి వ్యాపారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కశ్మీర్ లోయలో ఆమెదో ప్రత్యేక వసంతం.

తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన జోసెఫీన్ సెల్వరాజ్‌కి చిన్నప్పటి నుంచే ప్రకృతి, పూల మొక్కలు, తేనెటీగలపై ఆసక్తి. పంట పొలాల్లో ఎగిరే తేనెటీగలను గమనిస్తూ వాటి క్రమశిక్షణ, పనితీరుపై ఆశ్చర్యపడేవారు. తర్వాత ఒకసారి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బీ కీపింగ్ గురించి తెలుసుకుని దాన్నే వృత్తిగా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు. తేనెటీగలు ప్రమాదకరం కాబట్టి మహిళగా ఆమె ఈ పని చేయగలదా లేదా అని మొదట్లో కుటుంబ సభ్యులు కూడా సందేహపడ్డారు. కానీ, ఆమెకిది ఎంతగానో నచ్చింది. అందుకే తొలుత 10 లోపల సంఖ్యలో తేనెటీగల గూళ్లు ఉన్న ఆమె వద్ద ఇప్పుడు 7 వేలకు పైగా తేనె తుట్టెలు ఉన్నాయి అంటే ఆమె ఈ దిశలో ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు.
మొదట్లో చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత అందులో ఉన్న అవసరాన్ని గుర్తించి ‘విబిస్ నేచురల్ బీ ఫామ్’ పేరిట ఒక సంస్థ నెలకొల్పి దానికోసం పనిచేయడం ప్రారంభించారు. అయితే తన పనిని జోసెఫీన్ రహస్యంగా ఉంచదలచుకోలేదు. ఆ ప్రాంతంలోని ఇంటింటా ఒక తేనెగూడు ఉండేలా అక్కడి ప్రజల్ని ఆమె ప్రోత్సహించారు. దాని నుంచి తేనెటీగలకు ఎక్కువ హాని జరగకుండా తేనె ఎలా సేకరించాలో కూడా నేర్పించేవారు. ఇప్పటిదాకా 3000 మందికి పైగా మహిళలకు ఆమె తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చారు.
అలాగే స్వయం సహాయక సంఘాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా పనిచేస్తున్నారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా హనీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆమె చేసిన కృషికిగాను ప్రఖ్యాత జానకీ దేవి బజాజ్ పురస్కారం కూడా అందుకున్నారు. సహజ పద్ధతుల్లో తేనె తీయడం ఇష్టపడే ఆమె… రకరకాల పంట ప్రాంతాల్లో తేనె తుట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 33 విభిన్న రకాల తేనెలను తయారు చేస్తున్నారు. అందులో వేప, తులసి, ఉసిరి లాంటి సహజమైన తేనెలు కూడా ఉన్నాయి. మరి ఆ ప్రాంతవాసులంతా ఆమెను ‘క్వీన్ బీ’ అని పిలుస్తారు అంటే ఆశ్చర్యమేం కాదు కదూ!

అనుకోకుండా వచ్చిన ఓ కష్టం పంజాబ్‌కు చెందిన సుఖ్ పాల్ కౌర్‌ను తేనెటీగల పెంపకం వైపు మళ్లించింది. 2012 సంవత్సరంలో ఆమె భర్తకు తీవ్రమైన వెన్నుపూస గాయం అవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. అప్పటికే వాళ్లకు ఒక చిన్న తేనెటీగల వ్యాపారం ఉండేది. కానీ సుఖ్పాల్కు అందులో అనుభవం లేదు. కానీ, కుటుంబాన్ని సంక్షోభంలో పడేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే వయసును లెక్కచేయకుండా లూధియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో తేనెటీగల పెంపకం గురించి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. దాని మీద పట్టు సాధించి అప్పటికి వాళ్లకు ఉన్న 25 తేనెటీగల బాక్సులను 550కి పైగా పెంచి ఆ ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి స్వయం సహాయ బృందాలతో కలిసి గ్రీన్ పట్టి పేరిట జొన్న, రాగి బిస్కెట్లను తయారు చేస్తున్నది. ఆ సంఘాల ద్వారా తన ఉత్పత్తులను అమ్ముతున్నది. ఇప్పుడు సుఖ్‌పాల్ ఆ చుట్టుపక్కల ఎందరో మహిళలకు స్ఫూర్తి ప్రదాత.

కర్ణాటకలోని పచ్చని ప్రకృతి ఒడిలో అలరారే ప్రాంతం మధుగిరి. దీన్నే హనీ హిల్ అని కూడా పిలుస్తారు. అక్కడే పుట్టింది సావిత్రమ్మ. చెట్లు, పక్షులు, తేనెటీగలు వీటన్నిటినీ చూస్తూ పెరిగింది. అయితే కుటుంబ బాధ్యతల రీత్యా ఆమె తొలుత కూలి పనులకు వెళ్లేది. అప్పుడే ప్రభుత్వం ద్వారా తేనెటీగల పెంపకానికి సంబంధించి తరగతులు జరుగుతుండటంతో వాటికి హాజరైంది. అంతే తన చిన్ననాటి అనుబంధంతో దానికి పెనవేసుకుపోయింది. ఆ ప్రేమే ఆమెను బీ ఫ్రెండ్లీ హనీ కలెక్షన్ పద్ధతి వైపు మళ్లించింది. అంటే తేనెటీగల గూళ్లకు కానీ, వాటి ప్రాణాలకు కానీ ఎలాంటి హానీ జరగకుండా తేనె తీసే పద్ధతికి ఈమె శ్రీకారం చుట్టింది.
అక్కడ గిరిజనులకు ఈ అంశంలో శిక్షణ ఇచ్చింది. పల్లెటూళ్లలో తేనె సాగుకు సహకరిస్తున్నది. ఇక అయిదు తేనెటీగ పెట్టెలతో ప్రారంభించిన ఆమె ప్రయాణం ఇప్పుడు 250కి పైగా కాలనీలకు చేరింది. ఏడాదిలో నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నదామె. చుట్టుపక్కల మహిళా రైతులకు కూడా శిక్షణనిస్తూ ‘బీ లేడీ ఆఫ్ హనీ హిల్’గా పేరుపొందింది. ఇప్పుడు ఆమెను ప్రభుత్వం తరఫున ఆ జిల్లాలో జరిగే వ్యవసాయ శిక్షణ తరగతులకు ఆహ్వానిస్తుంటారు. ఆ విధంగా ఆమె మధుగిరి కొండల్లో మధుమాసం అయింది.