ముంబై: విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా శర్మ దంపతులపై ఆన్లైన్లో విమర్శలు గుప్పుమంటున్నాయి. ముంబై విమానావ్రయంలో ఓ దివ్యాంగుడిని పట్టించుకోని వీడియో వైరల్ కావడంతో ఆ స్టార్ కపుల్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. ఆ జంట చాలా మొరటుగా, ఏ మాత్రం దయలేని రీతిలో ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.
వృందావన్లోని ప్రేమానంద మహారాజ్ ఆశ్రమయాన్ని సందర్శించిన తర్వాత కోహ్లీ జంట ముంబై చేరుకున్నది. ఎయిర్పోర్ట్ టర్మినల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ఓ దివ్యాంగ అభిమాని తన వద్ద మొబైల్‌తో ఆ జంటను ఆశ్రయించాడు. స్టార్ కపుల్‌తో ఫోటో దిగేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. కానీ విరుష్కా జంట ఆ దివ్యాంగుడిని పట్టించుకోలేదు. అతన్ని పక్కకు నెట్టివేస్తూ కోహ్లీ వెళ్లి కారులో కూర్చున్నాడు. ఆ వెనుక అనుష్కా శర్మ కూడా అలాగే చేసింది. అక్కడకు చేరుకున్న సెక్యూర్టీ సిబ్బంది.. ఆ దివ్యాంగ కుర్రాడిని పక్కకు జరిపింది.
ఈ ఘటనకు చెందిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ టాప్ జంటపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫోటోకు వచ్చిన ఓ దివ్యాంగుడిని విస్మరించడం సరికాదు అని కొందరన్నారు. ప్రేమానంద్ మహారాజ్‌ను కలిసిన తర్వాత కూడా ఇంత అహంకారం ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం అని ఓ అభిమాని కామెంట్ చేశారు. దివ్యాంగుడిని నెట్టివేయడం బాధకరమని మరో వ్యక్తి అన్నారు. కోహ్లీ పట్ల తనకు ఉన్న గౌరవం పోయినట్లు మరో వ్యక్తి చెప్పాడు. ఇంత అహంకారం మెస్సీకి కూడా లేదని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.