కీవ్, మార్చి 23: ఉక్రెయిన్ మహిళలపై రష్యా దురాక్రమణదారులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఓ గ్రామంలోని ఇంట్లోకి చొరబడిన రష్యా సైనికులు.. ఇంటి యజమానిని చంపి అతడి భార్యను రేప్ చేసినట్టు ఉక్రెయిన్ విదేశాంగ సహాయమంత్రి ఎమైన్ ఆరోపించారు. తీరప్రాంత నగరం మరియుపోల్‌లో చిక్కుకుపోయిన దాదాపు లక్ష మంది పౌరులకు ఆహారం, ఇతర సామగ్రిని తరలిస్తున్న 15 మందితో కూడిన సహాయక బృందాన్ని పుతిన్ సేనలు అపహరించాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మరియుపోల్ ఆక్రమణకు అజోవ్ సముద్రం నుంచి రష్యా యుద్ధ నౌకలు దూసుకువస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని ల్యాబోరేటరీని రష్యా సేనలు ధ్వంసం చేశాయి. మరోవైపు, గూఢచర్యం ఆరోపణలపై 45 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని పోలండ్ నిర్ణయించింది. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని రష్యా స్పష్టం చేసింది.