కుత్బుల్లాపూర్, డిసెంబర్ 4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ తమ వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టింది. సంపాదనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్న ఈ సంస్థ సరైన అనుమతులు లేకుండా 170/3, 170/4, 170/5 సర్వే నంబర్లలో 260 విల్లాలను నిర్మించి కొనుగోలుదారులకు అంటగట్టింది. ఒక్కో విల్లాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ విచారణకు ఆదేశించారు. దీంతో దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పీ భోగీశ్వర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారి సాయిబాబా తమ సిబ్బందితో రంగంలోకి దిగి శనివారం ఆ విల్లాలను పరిశీలించారు. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన ఆ నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు. పైగా చెరువు బఫర్‌జోన్ స్థలాన్ని, అసైన్డ్ స్థలాన్ని ఆక్రమించి వాటిని నిర్మించడంతో 100 విల్లాలను సీజ్ చేశారు. మిగిలిన 160 విల్లాలకు కూడా అనుమతులు లేనట్టు గుర్తించామని, వాటిని కూడా సీజ్ చేస్తామని తెలిపారు. దీంతో లక్షలు వెచ్చించి ఆ విల్లాలను కొన్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు.