
గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 26: ‘రేవంత్.. మా ఊరికి రావొద్దు. మీ ఉనికి కాపాడుకొనేందుకు మా గ్రామస్థుల మధ్య చిచ్చు పెట్టొద్దు’ అంటూ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామస్థులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకొన్నారు. ఎర్రవల్లిలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రచ్చబండ కార్యక్రమ నిర్వహణకు కాంగ్రెస్ నాయకులు స్థల పరిశీలన కోసం వచ్చారు. వారిని ఎర్రవల్లి గ్రామస్థులు అడ్డుకొన్నారు. రేవంత్రెడ్డి తమ ఊరికి రావాల్సిన అవసరం లేదని నినాదాలు చేశారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ వాళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు తెచ్చారని, అందరికీ పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారని చెప్పారు. ఇక్కడ బంగారు పంటలు పండుతున్నాయన్నారు. అన్నదమ్ముళ్ల లెక్క బతుకుతున్న తమ మధ్య చిచ్చుపెడితే సహించబోమని హెచ్చరించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని చెదరగొట్టారు.