నిర్మల్ టౌన్, మార్చి 20 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని దివ్యా గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్మల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్‌తో పాటు లక్ష్మణచాంద ఎంపీపీగా ఎన్నికైన పద్మను సన్మానించారు. ఎజెండాలోని మొదటి అంశంగా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానించి, ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వంఅనుసరిస్తున్న విధానాలపై రైతులతో కలిసి పోరాటం చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పల్లెలు పచ్చదనం, పరిశుభ్రంగా కనిపిస్తున్నాయన్నారు. మన ఊరు-మన బడితో పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న 91వేల ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. నిర్మల్ జిల్లాలో వెయ్యి ఉద్యోగాలు స్థానికులకే వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో 192 పం చాయతీలకు కొత్త భవనాలు మంజూరైనట్లు మంత్రి ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీ చైర్పర్సన్ తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. ఉపాధిహామీ ద్వారా ఎక్కువ మంది కూలీలతో నిర్మల్‌ను మొదటిస్థానంలో నిలిపిన డీఆర్డీవో విజయలక్ష్మిని అభినందించారు. అంతకుముందు సమావేశంలో వివిధ సమస్యలపై జడ్పీటీసీలు పద్మ, జీవన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జానాబాయి, ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అలెగ్జాండర్, తదితరులు సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జడ్పీ వైస్ చైర్పర్సన్ సాగరాబాయి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, జిల్లా అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, రమేశ్‌కుమార్,అంజిప్రసాద్, అశోక్, నర్సారెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌బాబు, శంకరయ్య, ధన్‌రాజ్, శ్యాంరావు, సుధారాణి, మల్లికార్జున్, అశ్వక్, రాజేశ్వర్‌గౌడ్, హన్మండ్లు, కలీం, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడాలి. రైతులు పండించిన పంటలను ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై వివక్ష చూపడం తగదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పని చేసే అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు తప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
దండే విఠల్, ఎమ్మెల్సీ
ఖానాపూర్ నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో ప్రజలకు కనీస వసతులు లేవని అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఖానాపూర్ నియోజకవర్గంలో రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు లేక గిరిజన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నా దానిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి.
రేఖానాయక్. ఎమ్మెల్యే ఖానాపూర్
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులను ప్రభు త్వం మంజూరు చేస్తున్నది. సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. ముథోల్, భైంసా దవాఖాన్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఆధునాతన సౌకర్యాలు కల్పించాలి. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. రైతులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు.
విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే