హనుమకొండ, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది. అసమర్థ, అరాచక కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి వరంగల్ నుంచి వనపర్తి వరకు.. సూర్యాపేట నుంచి సంగారెడ్డి దాకా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40శాతం గ్రామాలు బీఆర్ఎస్కే మద్దతు తెలిపాయి. అధికారంలో ఉన్న పార్టీ వైపే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొగ్గుచూపే సంప్రదాయాన్ని మార్చి పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెంట నిలిచారు.
పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి 55 శాతానికిపైగా ఆధిక్యత వస్తుంది. తాజా, ఎన్నికల్లో సంప్రదాయం మారింది. అధికార పార్టీకే ఆధిక్యత అనే రాజకీయ సిద్ధాంతం తారుమారైంది. సర్పంచ్ల పరంగా ప్రతి మండలంలోనూ అధికార పార్టీకి దీటుగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు నిలబడ్డారు. సంఖ్యాపరంగా అధికార పార్టీ స్వల్ప ఆధిక్యత ఉన్నా ప్రతి ఊరిలో, వార్డులోనూ బీఆర్ఎస్కు ఉన్న పట్టును పంచాయతీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.
కాంగ్రెస్ పార్టీ రెండేండ్లుగా సాగిస్తున్న పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. హామీలు నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాతీర్పును ముందుగానే అంచనా వేసిన అధికార పార్టీ ఎన్నికలను వాయిదా వేస్తూనే వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో కొన్ని నెలలు హడావుడి చేసి సాగదీసింది. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఫలితాలపై సందేహాలున్నా గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్లె గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
అధికార యంత్రాంగాన్ని ముందు పెట్టి పోటీ లేకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతున్నకొద్దీ బీఆర్ఎస్ అభ్యర్థులు, క్యాడర్‌పై కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారు. బరిలో నిలిచిన వారిని అన్ని రకాలుగా బెదిరింపులకు గురిచేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేసుకోకుండా, పోలింగ్ రోజు గ్రామాల్లో లేకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోటీ నుంచి తప్పుకోవాలని అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన అధికార పార్టీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అనేక రకాలుగా బెదిరింపులకు, దాడులకు తెగబడినా ఫలితాలను మార్చలేకపోయింది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం స్వ యంగా ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ వారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని, లేకపోతే గ్రామాలకు నిధులు రావని ఓటర్లను బెదిరించారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో రెండు చొప్పున సభలు పెట్టారు. అలాగే మం త్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరూ తిరుగుతూ జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే నిధులు వస్తాయని ఓటర్లను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఏ పథకం కావాలన్నా, పథకాలు అమలు చేయాలన్నా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వారిని సర్పంచులుగా గెలిపించాలని ప్రజలను బెదిరించారు. ఎన్ని చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతో చివరికి పోలీసులు, అధికారుల సాయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ వారిని గెలిపించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు ఉద్యమం, పదేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనను పల్లెజనం తాజా ఎన్నికల్లో గుర్తు చేసుకున్నారు. పల్లె ప్రగతి పేరుతో ప్రతి ఊరిని సమగ్రంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, రెండేండ్లుగా పూర్తిగా వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పోల్చుకున్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి ఏ చిన్న ఇబ్బంది కలగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని కష్టాలే ఉంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగానే రైతులకు యూరియా కష్టాలు వచ్చి పడ్డాయి. వానకాలం సీజన్ నుంచి యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు.
పంట పడించేందుకు, పండిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. రైతుబంధుతో పెట్టుబడి, అదనులో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, ఉన్న ఊరిలోనే కనీస మద్దతు ధరకు పంటకు అమ్ముకునే పరిస్థితులతో కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా ఉండేది. కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ మారిపోయాయి. అందుకే గ్రామీణ ఓటర్లు, ముఖ్యంగా రైతులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ వెంటే నడిచారు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించారు.