దేవరుప్పుల, డిసెంబర్ 17 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామపంచాయతీని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. గ్రామంలోని 10కి పది వార్డుల్లో గెలుపొందగా, సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంధ్యారాణి ఏకంగా 401 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కట్టా అనితపై విజయం సాధించింది. గెలుపొందిన వార్డు సభ్యుల్లో బింగి శ్రీనివాస్, ఎడమ సంతోష్‌రెడ్డి, కాసర్ల వెంకమ్మ, కలువల నగేశ్, వడ్లకొండ రాధిక, మేడ స్వప్న, నల్ల కావ్య, మేడ నర్సయ్య, నక్క నారాయణ, బోగు యుగేంధర్ ఉన్నారు.
పరిగి, డిసెంబర్ 17 : పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సొంత మండలం పరిగిలో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కారు స్పీడును అధికార పార్టీ అందుకోలేకపోయింది. మండలంలో 32 గ్రామపంచాయతీలు ఉండగా, 2 ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 30 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 19 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మండలంలోని రంగాపూర్, పేటమాదారంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతోపాటు అన్ని వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది క్లీన్‌స్వీప్ సాధించింది. మండలంలో 65శాతం గ్రామపంచాయతీలు బీఆర్ఎస్ వశమయ్యాయి.