హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలనే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ‘విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం శనివారం ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక స్టార్టప్‌లు వివిధ రకాల ఆవిష్కరణలతో దూసుకెళ్తున్నాయి. ఇదే తరహాలో గ్రామీణ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషిచేస్తున్న స్టార్టప్ నిర్వాహకులను ప్రోత్సహించేందుకు విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నట్టు టీఎస్ఐసీ నిర్వాహకులు తెలిపారు.