వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయము అని చెప్పినా అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ ధాన్యం కొనాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 165 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, సోమవారం కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఒకే రోజు రైతులంతా ధాన్యాన్ని తీసుకురాకుండా కొందరే వచ్చేలా చర్యలు తీసుకుంటూ ఇప్పటికే టోకెన్లను సైతం అందజేశారు. ఉమ్మడి జిల్లాలో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, నవంబర్ 15 : వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచే కొనుగోళ్లకు కేంద్రాలను సిద్ధం చేశారు. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఈ వానకాలంలో 58,787 మంది రైతులు సుమారు లక్షా 2వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,27,676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధరగా నిర్ణయించారు.
10వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కొనుగోలు కేంద్రం…
10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తక్కువగా ధాన్యం వచ్చే రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరిగి డివిజన్లో 69,650 మెట్రిక్ టన్నులు, కొడంగల్ డివిజన్లో 59,786 మెట్రిక్ టన్నులు, తాండూరు డివిజన్లో 52,039 మెట్రిక్ టన్నులు, వికారాబాద్ డివిజన్లో 12,048 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సైతం అధికారులు సిద్ధంగా ఉన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆయా శాఖల ఉద్యోగులకు శిక్షణ సైతం పూర్తి చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుంది.
అందుబాటులో 18 లక్షల ఖాళీ బస్తాలు..
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే 18 లక్షల ఖాళీ బస్తాలు అందుబాటులో ఉన్నాయి. 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 50లక్షల బస్తాలు అవసరమవుతాయి. మిగిలిన బస్తాలను విడుతల వారీగా తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌కు ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా 50 రైస్‌మిల్లులను ఎంపిక చేశారు. కొనుగోలు చేపట్టిన ధాన్యం బస్తాలు రైస్‌మిల్లులకు చేరిన అనంతరం అక్కడి నుంచి తమ లాగిన్‌కు పూర్తి వివరాలు వచ్చిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం..
వికారాబాద్ జిల్లా పరిధిలో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం. ఇందుకుగాను అవసరమైన ప్రతిచోటా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పీఏసీఎస్, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలు, ఐకేపీల ఆధ్వర్యంలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరణ ఏర్పాట్లు చేపట్టాం. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, నవంబర్ 15, (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కేంద్రం వడ్లను కొనుగోలు చేయము అని స్పష్టం చేసినప్పటికీ సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు. ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేశారు. ధాన్యాన్ని సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకేరోజు రైతులందరూ కొనుగోలు కేంద్రానికి రాకుండా రోజుకు 1000 క్వింటాళ్లు ధాన్యాన్ని సేకరించేలా నిర్ణయించారు. ఈ ప్రకారమే గ్రామాల వారీగా ఏఈవోలు టోకెన్లను ఇప్పటికే జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటించేలా, కొనుగోలు కేంద్రాల వద్ద నీటితోపాటు సబ్బు, శానిటైజర్‌ను ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రెండు, మూడు రోజుల్లో డబ్బులను జమ చేయనున్నది.
1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం..
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. జిల్లాలో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఎంసీ, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను గతంతో పోలిస్తే 10 కొనుగోలు కేంద్రాలను పెంచుతూ నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే రైతులు ఒక్కక్కరుగా ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పుంజుకోనున్నది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. గోనె సంచులు కొంతమేర అందుబాటులో ఉండగా, మరో వారంలోగా జిల్లాకు అవసరమయ్యే గోనె సంచులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంలనూ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గోదాంలలో ఉన్న సీఎంఆర్ రైస్‌ను ఎఫ్‌సీఐకి తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. యాసంగిలో చాలా వరకు సన్నరకం వడ్లను సేకరించిన నేపథ్యంలో కొంతమేర నేరుగా రేషన్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నారు. వానకాలం సీజన్‌కుగాను మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. వరి ధాన్యం క్వింటాలుకు ‘ఏ’ గ్రేడ్ క్వింటాలుకు రూ.1960లు, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1940ల కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. వానాకాలం సీజన్‌కుగాను జిల్లాలో 85,119 మంది రైతులు 1.26 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, 2.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు..