తాండూరు, అక్టోబర్ 30 : ఆరోగ్యమే మహాభాగ్యమని.. అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత వైద్యం అందిస్తునదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ఘనంగా ప్రారంభించారు. తాండూరులో రూ.20 కోట్లతో పూర్తయిన మాతాశిశు దవాఖాన, రూ.3.47 కోట్లతో పూర్తయిన మున్సిపల్ భవనం, రూ.2.25 కోట్లతో పూర్తయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభోత్సవంతో పాటు రూ.20 లక్షలతో మున్సిపల్ పరిధిలోని సాయిపూర్లో అంగన్వాడీ భవన నిర్మాణం, రూ.50 లక్షలతో పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు మల్రెడ్డిపల్లి ఫంక్షన్హాల్లో 1.65కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య, వైద్యం అందుతున్నదన్నారు. అందుకు తగ్గట్లు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. తాండూరు ప్రభుత్వ దవాఖానకు కావాల్సిన మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిరుపేదలకు వరమన్నారు. అర్హులందరూ ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో విధిగా బాధ్యతతో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక కాలుష్యం తాండూరులో ఉందని.. అందుకు తగ్గట్లు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మొక్కలు నాటి పెంచాలని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీల్లో గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించిన నిధులతో గ్రీనరీలు, నర్సరీలతో పాటు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు.
ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తెచ్చిన నిధులతోపాటు మరిన్ని ప్రత్యేక నిధులతో తాండూరులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాలల్లో కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాండూరులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. పండించిన ప్రతి గింజకు మద్ధతు ధర కల్పిస్తామన్నారు. అడవుల శాతాన్ని పెంపొందించేందుకు, కరువు కాటకాలను పూర్తిగా పారదోలడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, సబ్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.