పరిగి, అక్టోబర్ 29: భూపరిపాలన రంగంలో ‘ధరణి’ విప్లవాత్మక మార్పు అని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయ న్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమై ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల అధికారులతో కలిసి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ధరణి పోర్టల్ రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాల్లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉందని, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన ఆన్లైన్ పోర్టల్ అని పేర్కొన్నారు. ధరణిలో ప్రస్తుతం 31లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ధరణి పోర్టల్‌తో 90,201 స్లాట్లు బుక్ చేయగా, 85,619 (94.92శాతం) ఫిర్యాదులను పరిష్కరించినట్లు చెప్పారు. ధరణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పూడూరు మండలం మొదటి స్థా నం లో నిలిచిందని ఆమె తెలిపారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని, వ్యవసాయ సంబంధిత భూరిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ధరణి లోని టాంపర్ ప్రూఫ్ పౌరులకు అనువుగా ఉం డటం, తక్షణమే రిజిస్ట్రేషన్లతోపాటు మ్యుటేషన్ వెంటనే జరిపే సదుపాయం ఉందన్నారు. అడ్వాన్స్‌గా స్లాట్ బుకింగ్, బయోమెట్రిక్ నిర్ధారణ, ప్రతి సర్వేనెంబర్‌కు మార్కెట్ విలువ నిర్ధారణ, రిజిస్ట్రేషన్లతోపాటు మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం మొత్తం ఆటోమెటిక్‌గా నిర్ధారణ సౌలభ్యం, ఆన్లైన్ చెల్లింపులు వంటి ప్రత్యేకత లు ధరణిలో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను అధికారులు సన్మానించారు. అనంతరం పలువురు అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా.. అమయ్‌కుమార్
షాద్‌నగర్, అక్టోబర్ 29: భూసమస్యలపై ప్రజలకు సత్వర పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణి పోర్టల్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ధరణి రెవెన్యూ శాఖ నిర్వహణలో సురక్షితమైన, అవాంతరాల్లేని, ట్యాంపర్ ఫ్రూఫ్‌గా ఉందన్నారు. అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్‌తో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని.. రైతులు, వ్యాపారులు తమ వ్యవసాయ భూములను నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారని తెలిపారు. ఏడాది కా లంలో జిల్లాలో 61,289 రిజిస్ట్రేషన్లు, 7,518 గిఫ్ట్ డీడ్లు, 4,571 వారసత్వ లావాదేవీలు, 27,963 మ్యుటేషన్లు,19,442 భూఫిర్యాదులు ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమయ్యాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, ట్రైనీ కలెక్టర్ ఫళని, డీఆర్వో హరిప్రియ, తహసీల్దార్లు పాల్గొన్నారు.