యాచారం అక్టోబర్28 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండటంతో మత్స్యకారులకు చేపలు సిరులు కురిపిస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ మత్స్యకారులు తగిన జీవనోపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలోని పెద్దచెరువు, మేడిపల్లి ఊరచెరువు, సాలి చెరువుల వద్ద మత్స్యకారులు జోరుగా చేపలు పడుతున్నారు. చేపలు తాజాగా లభించడంతో చేపల విక్రయానికి మంచి డిమాండ్ సంతరించుకున్నది. మత్స్యకారులు చెరువుల్లో పెంచిన రవ్వ, బొచ్చ, కొర్రమీను చేపలను పట్టి ప్రజలకు కిలో రూ.150చొప్పున చెరువుల వద్దే విక్రయిస్తున్నారు. కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి, మీర్ఖాన్పేట, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, ఆకులమైలారం తదితర గ్రామాలనుంచి ప్రజలు చెరువు వద్దకు వెళ్లి చేపలను కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని తాటిపర్తి బందం చెరువు, నానక్‌నగర్ తలాబ్ చెరువు, మేడిపల్లి ఎక్వ చెరువు, సాలి చెరువు, ఊర చెరువు, తక్కళ్లపల్లి చెన్నారెడ్డి చెరువు, చింతపట్ల లక్ష్మణ చెరువు, నందివనపర్తి కాముని చెరువు, కుర్మిద్ద పెద్ద చెరువు, ధర్మపురి చెరువుల్లో చేపలను పెంచుతున్నారు. పెరిగిన చేపలను పట్టి ప్రజలకు చెరువు వద్దనే విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తాజా చేపలు కావడంతో ప్రజలు చేపలను కొనడానికి పోటీపడుతున్నారు. పైగా చేపల పెరుగుదల బాగుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌కాకతీయ పథకంతో ప్రభుత్వం చెరువుల్లో పూడికతీయడంతో పాటుగా మత్స్యకారులకు తగిన ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో సబ్సిడీతో చేపపిల్లలను వేయడం మత్స్యకారులకు ఎంతో మేలు జరిగిందని పేర్కొంటున్నారు. సొసైటీలకు ప్రభుత్వం మోటార్ సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సులు, జీవితబీమా వసతులను కల్పించిన విషయం తెలిసిందే, గతంలో చెరువుల్లో వేసిన చేపపిల్లలు ప్రస్తుతం పెరిగి పెద్ద కావడంతో ఒక్కసారిగా చేపల పంట పండింది. దీంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. చేపలను విక్రయించడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు చేపల విక్రయాలతో తగిన జీవనోపాధి పొందుతున్నారు. గతేడాది కంటే అధికంగా చేపపిల్లలను పెంచడంతో అదే స్థాయిలో మత్స్యకారులు లాభాలను పొందుతున్నారు. తాజా, రుచికరమైన చేపలను కొనుగోలు చేసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చింతపట్ల లక్ష్మణ చెరువు 24సంవత్సరాల తరువాత నిండటంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2లక్షల చేపపిల్లలను చెరువులో వదిలారు. దీంతో చేపల దిగుమతి లేకుండానే తాజా చేపలు తక్కువ ధరలకు స్థానికంగా లభిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలుపుతున్నారు.