ఆది నుంచి వికారాబాద్ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉన్నది. ఆనాడు ఉద్యమ నేతగా ప్రత్యేక జిల్లా డిమాండ్‌కు మద్దతు తెలిపిన ఆయన.. స్వరాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినాక జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. 2023-24 విద్యా సంవత్సరంలో వికారాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతో జిల్లా విద్యార్థులకు వైద్య విద్య చేరువ కానుండగా.. పేదలకు మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి.
పరిగి, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం మొదటి ప్రాధాన్యతగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ హామీ ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం ఇతర పార్టీల నాయకులకు రివాజుగా మారింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారంటే నెరవేరుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఉద్యమ నేతగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ హామీ ఇచ్చినా సాధ్యమైనంత త్వరగా నెరవేర్చడం ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాలన్నది సీఎం ప్రధాన ఉద్దేశం. గత పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికలు వచ్చాయంటే కానీ గుర్తు పెట్టుకోలేకపోయేవారు. కొన్ని హామీలు ఎన్నికలప్పుడే వినిపిస్తాయి, మళ్లీ వాటి ఊసు ఉండదు. సీఎం కేసీఆర్ దృష్టిలో ఇచ్చిన హామీని ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత త్వరగా నెరవేర్చడం ద్వారా ప్రజాభిమానం పొందుతున్నారు. ఇందుకు ఉదాహరణ వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు అంశం చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావడంతోపాటు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న దవాఖాన వల్ల పేదలకు ఉచితంగా మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండగా 2023-24లో రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించగా, అందులో వికారాబాద్ జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. తద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య మరింత అందుబాటులోకి రానున్నది. అలాగే కళాశాలకు అనుబంధంగా సుమారు వెయ్యి పడకల దవాఖాన సైతం ఏర్పాటు చేయనుండడంతో అనేక రకాల వ్యాధులకు పేదలకు ఉచితంగా వైద్యం అందుతున్నది.
నెరవేరనున్న ఎన్నికల హామీ
తెలంగాణ ఉద్యమం సమయం నుంచి వికారాబాద్ ప్రాంతంపై ఆనాటి ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం. అప్పట్లోనే ప్రత్యేక జిల్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించడంతోపాటు మరింత అభివృద్ధి చెందాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతున్నది. 2023-24 సంవత్సరంలో వికారాబాద్ జిల్లా పరిధిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. తద్వారా ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరబోతున్నందుకు జిల్లా ప్రజలు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాను వైద్య పరంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వికారాబాద్‌లో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుచేసి 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఈ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా అందజేస్తున్న సేవలకుగాను దేశంలోనే నెం.1గా గుర్తింపు తెచ్చుకుంది. డ్రగ్స్ సెంటర్, కొవిడ్ పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్ సెంటర్ సైతం వికారాబాద్‌లో నెలకొల్పారు. డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్లు, అత్యవసర మందులు తరలించే కార్యక్రమానికి వికారాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికవడం గమనార్హం.
పేదలకు మరిన్ని వైద్య సేవలు
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తున్నది. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమకు దగ్గరగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో చదువుకునే వెసులుబాటు ఏర్పడుతున్నది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు పూర్తయితే విద్యార్థులు జిల్లాలోని మెడికల్ కళాశాలలోనే చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. కళాశాలలో వైద్య విద్య బోధించే ప్రొఫెసర్ పోస్టులు, వాటికితోడు ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బంది నియామకాలు చేపడుతారు. వైద్య కళాశాల నిర్మాణానికి సుమారు రూ.500కోట్లు పైచిలుకు ఖర్చు చేయనున్నారు. మరోవైపు పేదలకు ఉచిత వైద్యసేవలు మరిన్ని అందనున్నాయి. వైద్య కళాశాల మంజూరు చేయాలంటే 330 పైచిలుకు బెడ్ల దవాఖాన అనుబంధంగా ఉండాలి. కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుతో అనుబంధంగా ఉండే దవాఖాన వల్ల వికారాబాద్ జిల్లా ప్రజలకు సకాలంలో, మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.