దక్షిణ భారత దేశంలోనే మరో కాశీగా పేరొందిన మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నది. కార్తికమాస పవిత్ర స్నానాలకు ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం ఉత్సవాలకు ముస్తాబైంది. జాతర నేడు ప్రారంభమై పదిహేను రోజులపాటు కొనసాగనున్నది.
మంచాల, నవంబర్ 18: దక్షిణ భారతదేశంలోనే మరో కాశీగా పేరొందిన బుగ్గరామలింగేశ్వరాలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నది. మండలంలోని ఆరుట్ల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కార్తిక మాస పవిత్ర స్నానాలకు పుణ్యక్షేత్రంగా నిలుస్తున్నది. 15 రోజులపాటు జరుగనున్న జాతరకు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులకు అపార నమ్మకం. బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు కార్త్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు (15 రోజులు ) జరుగుతాయి. తూర్పు నుంచి పడమరకు నీరు ప్రవహించి తిరిగి మళ్లీ తూర్పు వైపునకు ప్రవహించడం ఈ ఆలయం వద్ద ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు ప్రత్యేకంగా శివలింగానికి పూజలు చేశాడని, అందుకే ఈ పుణ్యక్షేత్రానికి బుగ్గరామలింగేశ్వరాలయంగా పేరొచ్చిందని చరిత్ర చెబుతున్నది. తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నీటిలో భక్తులు వేల సంఖ్యలో పుణ్యస్నానాలను ఆచరించి కార్తిక పౌర్ణమి వ్రతా లు నిర్వహిస్తారు. కాశీకివెళ్లి శివుడిని దర్శించుకోలేని వారు ఈ ఆలయానికి వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటే కాశీకెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కుటుం బ సభ్యులు, బంధువులతో కలిసి వంటావార్పు చేసుకుని వనభోజనాలను చేస్తారు. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా ఎత్తైన కొండలు, గుట్టలతో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది.
ఏర్పాట్లు పూర్తి..
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో జాతర కార్త్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులపాటు ఘనంగా జరుగుతుంది. ఇక్కడికి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు సత్యనారాయణ స్వామి వ్ర తాలు చేసేందుకు ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. స్నానాలు చేసేందుకు, దుస్తులను మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.
నాగన్న పుట్ట- కబీర్దాస్ మందిరం..
ఆలయంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులంతా ఆలయం పక్కనే ఉన్న కబీర్దాస్ మందిరం, నాగన్నపుట్టను దర్శించుకోవ డం అనవాయితీగా వస్తున్నది. ఈ మందిరంలో నాగన్న పుట్ట, శివపార్వతులు, కబీర్దాస్ ధ్యాన మందిరం ఉన్నది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా 1975లో ఇక్కడ కబీర్దాస్ మందిరాన్ని నిర్మించారు. ప్రతి కార్త్తిక మాసంలో నాగన్న పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మందిరంలోనే చాలాకాలం పాటు ధ్యానం చేసిన నర్సింహ బాబా ఇక్కడే సజీవ సమా ధి అయినట్లు స్థానికులు చెబుతుంటారు.
ఆలయానికి ఇలా చేరుకోవాలి
మండలంలోని ఆరుట్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ఉన్నది. హైదరాబాద్ నుంచి ఆలయానికి చేరుకునేందుకు ఎంజీబీఎస్ నుంచి 279, సాగర్ రోడ్డు నుంచి 277 నంబర్ గల బస్సుల ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి ఆరుట్లకు ౩౦ నిమిషాలకు ఒక్కటి చొప్పున ఆర్టీసీ సంస్థ బస్సులను రామలింగేశ్వరాలయం వరకు నడుపుతున్నది. నల్గొండ జిల్లా నారాయణపూర్, మునుగోడు, చౌటుప్పల్ నుంచి వచ్చే వారు నారాయణపూర్ నుంచి ఆరుట్లకు బస్సుల్లో వచ్చి అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు.
వ్రతాలు చేస్తే కోర్కెలు తీరుతాయి..
కార్త్తిక మాసంలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కార్త్తిక పౌర్ణమి నుంచి అమావా స్య వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరిస్తారు.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
ఉత్సవాలను తిలకించేందు కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. తాగునీరు, వైద్యం, పోలీస్‌శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. భక్తులు వ్రతాలు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఏర్పాట్లు పూర్తి
స్వామి వారి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతరలో భక్తులకు తాగునీరు, వ్రతాలు చేసుకునేందుకు వసతులు కల్పించడం జరిగింది. పదిహేను రోజులపాటు ఘనంగా నిర్వహిస్తాం.
-సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి
సీసీ కెమెరాల ఏర్పాటు
జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మంచాల పోలీసు ల ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు బందోబస్తులో ఉంటారు. అదేవిధంగా 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తు న్నాం. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని పట్టుకునేందుకు షీటీమ్స్ సభ్యులు అందుబాటులో ఉంటారు.
-సీఐ వెంకటేశ్‌గౌడ్