బొంరాస్‌పేట, నవంబర్ 18: మండలంలో ఈ ఏడాది సమృ ద్ధిగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగులు పారాయి. సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. వానకాలం వరి పంటలకు నీటిని వాడుకున్నా చెరువులు, కుంటల్లో ఇప్పటికీ పుష్కలంగా నీళ్లున్నాయి. దీంతో యాసంగి సాగుకు రైతుల్లో భరోసా ఏర్పడింది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఆశాజనకంగా వానలు కురవడంతో రైతులు చెరువులు, కుంటల కింద వానకాలంలో వరి పంట సాగు చేశారు. పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. వానకాలం పంటను కోసిన తరువాత రైతులు యాసంగి సాగుకు సిద్ధ మవుతారు. మండలంలో 13 నోటిఫైడ్ చెరువులున్నాయి. వీటి కింద నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బొంరాస్ పేట పెద్ద చెరువు కింద 629 , వడిచెర్ల పెద్ద చెరువు కింద 161 , కొత్తూరు చెరువు కింద 305, తుంకిమెట్ల చెరువు కింద 175 , దుప్‌చెర్ల కుతుబ్గండి చెరువు కింద 185, దుప్‌చెర్ల దేవుని చెరువు కింద 67 , మెట్లకుంట ఎల్లమ్మ చెరువు కింద 221, బురాన్‌పూర్ చిన్నవాగు ప్రాజెక్టు కింద 238, బురాన్‌పూర్ పెద్ద చెరువు కింద 138, చౌదర్పల్లి పెద్ద చెరువు కింద 130 , ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద 1326 దుద్యాల చింతల్ చెరువు కింద 128, దుద్యాల గోపన్ చెరువు కింద 153 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద 1326 ఎకరాల ఆయకట్టు ఉన్నా నీటి నిల్వ సామర్థ్యం లేనందున సుమారుగా 600 ఎకరాలలో మాత్రమే పంటలను సాగు చేస్తారు. సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల మండలంలోని చాలా చెరువులు, కుంటల కింద చాలా ఏండ్ల తరువాత వానకాలంతో పాటు యాసంగిలో కూడా రెండు పంటలను పండిస్తున్నారు.
బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు
సమృద్ధిగా కురిసిన వర్షాలతో మండలంలోని వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రైతులు సాధారణంగా బోర్ల కింద యాసంగిలో కూడా వరి పంటనే సాగు చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాధికారులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేస్తున్నారు. బోర్ల కింద నీటి వసతి ఉన్న భూముల్లో వరికి బదులుగా వేరుశనగ, పెసర, కంది, బొబ్బర్లు వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే అయ్యే ఖర్చు, వచ్చే దిగుబడి, లాభం గురించి రైతులకు వివరిస్తున్నారు.
మినుములు సాగు చేస్తా
యాసంగిలో ఈ ఏడాది వరికి బదులుగా మినుము లు సాగు చేయాలని అనుకుంటున్నా. ఏటా యాసంగిలో వరి పంటనే సాగు చేసేవాడిని. ప్రభుత్వం ఇస్తు న్న సూచలను పాటిస్తూ వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గిం చి రెండు ఎకరాలలో మినుములు సాగుచేస్తా. మినుములకు కూడా మంచి ధర వస్తుంది.
-ఎం.జితేందర్‌రెడ్డి, రైతు మెట్లకుంట