తాండూరు, సెప్టెంబర్ 14 : తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల కాగితాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాల శోభాయాత్రలు కన్నుల పండువగా సాగాయి. దారి పొడవునా భజనలు, బ్యాండు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాల హోరుతో భక్తులు నీరాజనం పలికారు. జై గణేశా…జై జై గణేశా.., గణపతి బొప్ప మోరియా అంటూ నిమజ్జనానికి ముందుకు సాగారు. తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ , కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌తో పాటు పలు మండలాల ప్రజలు భారీగా తరలివచ్చారు. నిమజ్జనోత్సవంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి పి.బాల్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొని భద్రేశ్వర చౌక్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైనుంచి పూలు, రంగులు చల్లుతూ వినాయకులకు ఘనస్వాగతం పలుకుతూ వీడ్కోలు చెప్పారు. ఎస్పీ నారాయణ, అడిషనల్ ఎస్పీ రషీద్, డీఎస్పీ లక్ష్మీనారాయణ బందోబస్తును పర్యవేక్షించారు. తాండూరు కాగ్నానదితో పాటు గ్రామాల సమీపంలోని వాగులు, చెరువులు, బావుల్లో ‘పోయిరా గణపయ్యా మళ్లీ రావయ్యా’ అంటూ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.