చిరుధాన్యాల సాగుతో రైతు ఇంట సిరులు కురువనున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నేలలు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అరికెలు, ఊదల పంటల సాగుకు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అతి తక్కువ వర్షపాతం నమోదైనా పంట చేతికొస్తుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిరుధాన్యాల సాగుపై అధిక శాతం రైతులు ఆసక్తిని చూపుతుండడంతో ప్రభుత్వం సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు ధర పలుకుతుండగా, క్వింటాలుకు రూ. 6వేల నుంచి రూ. 7వేల వరకు వస్తుంది. అంటే ఎకరాకు దాదాపు రూ.70 వేలకుపైగా ఆదాయం సమకూరనున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 3 వేల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలను సాగు చేశారు. రైతుల్లో అవగాహన పెంచి ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేలా వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది.
ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల పెరుగుతున్న ఊబకాయం, అనారోగ్య సమస్యలతో తిరిగి తృణధాన్యాలకు ప్రాధాన్యం పెరిగింది. అందుకు అనుగుణంగా సర్కారు సైతం తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా రైతులు చిరు ధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇతర పంటల కన్నా ఖర్చు తక్కువ.. ఆశించిన స్థాయిలో దిగుబడులు కూడా రావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిరుధాన్యాల ప్రాముఖ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన వస్తే వీటి వినియోగం కూడా పెరుగుతుంది. తేలికపాటి నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కొర్ర పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో తృణధాన్యాల సాగు రెండు మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నది. వానకాలంలో వికారాబాద్ జిల్లాలో 2,500 ఎకరాల్లో జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలు సాగు చేయగా.. యాసంగిలో సైతం ఇదే స్థాయిలో తృణధాన్యాల సాగు జరుగుతుంది. 7 రకాల తృణధాన్యాలు ఉండగా.. వాటిలో జొన్న, రాగులు, కొర్రలు, అక్కడక్కడ సామలు పండిస్తున్నారు. రంగారెడ్డిజిల్లాలోని 11 మండలాల్లో ఈ ఏడాది 73 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పంటల నూర్పిడి కూడా పూర్తయింది.
వికారాబాద్ జిల్లాలో 3,500 ఎకరాలకు పెంచాలన్నది లక్ష్యం జిల్లా పరిధిలో జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, సామలు సుమారు 2500 నుంచి 2600 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 2400ల ఎకరాలకు పైగా జొన్న పంట సాగవుతున్నది. జిల్లాలోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్, కులకచర్ల, ధారూరు, వికారాబాద్ మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో తృణధాన్యాల సాగు జరుగుతున్నది. యాసంగిలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాలు తృణధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 73 ఎకరాల్లో చిరు ధాన్యాలు సాగు చేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో కొర్రలు 10.69 ఎకరాలు, రాగులు 61.91 ఎకరాల్లో సాగయ్యాయి.
మార్కెట్లో మంచి డిమాండ్
మన పూర్వీకులంతా ఆరోగ్యంగా ఉండటానికి కారణం.. వారు కష్టపడి పనిచేసేవారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు. ప్రస్తుతం సమాజంలో మనిషికి శారీరక కష్టం పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా నాజూకు తిండికి అలవాటు కావడం వల్లన అనారోగ్యాలపాలవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటు ఆహారపు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. తృణధాన్యాల సాగు తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. అలాగే తక్కువ నీటి వినియోగంతో ఈ పంటలు పండుతాయి. తృణధాన్యాలకు చక్కటి ధర సైతం మార్కెట్లో లభిస్తుంది. ఒక ఎకరం పొలంలో కొర్రలు, రాగులు, సజ్జలు, సామలు సాగు చేస్తే రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. 90 నుంచి 110 రోజుల్లో పంటలు చేతికి వస్తాయి. జొన్న ఎకరాకు 12-14, కొర్రలు, రాగులు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో జొన్నలు కిలో రూ.35-40, కొర్రలు రూ.60-70, రాగులు రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఖర్చులుపోగా రైతులకు లాభాలే వస్తున్నాయి. వరి, మక్కజొన్న, కూరగాయల పంటల కన్నా చిరుధాన్యాల సాగులోనే మంచి దిగుబడులు, లాభాలు పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.
పెరిగిన వినియోగం
మారుతున్న పరిస్థితుల్లో ఊబకాయం, అనేక రోగాల బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్‌కు అలవాటుపడినవారు సైతం మళ్లీ జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, వేసవిలో రాగి అంబలి తాగుతున్నారు. ప్రస్తుతం ఈ ధాన్యాలను ప్రాసెసింగ్ చేసి, పిండితో వివిధ రకాల బిస్కెట్లు, జావ తయారీకి అవసరమైన రెడిమిక్స్, నూడుల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు.
3,500 ఎకరాలకు సాగు పెంపు
వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 2500 ఎకరాల్లో పలు రకాల ధాన్యాలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం లభిస్తున్నది. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పించి యాసంగిలో ఈ ధాన్యాల సాగు విస్తీర్ణం 3500 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
-ఎస్.విజయభారతి, ఏడీఏ, వికారాబాద్
పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ
జిల్లావ్యాప్తంగా 11 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 73 ఎకరాల్లో రైతులు చిరుధాన్యాల సాగు చేపట్టారు. కొర్రలు, రాగులు, సజ్జలు, సామలు తదితర పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడి తక్కువ, దిగుబడులు ఎక్కువగా ఉండడంతో రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. పంటల సాగులో ఎప్పటికప్పుడూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం.
కొర్రసాగులో మంచి లాభాలు
ఇతర పంటల కన్నా చిరుధాన్యాల సాగులో మంచి లాభాలున్నాయి. నేను ఈ ఏడాది ఖరీఫ్‌లో 10గుంటల పొలంలో కొర్రసాగు చేశాను. ప్రస్తుతం పంట దిగుబడి చేతికొచ్చింది. రూ.3500 ఖర్చు అయ్యింది. 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో కిలో కొర్రలు రూ.60-70 అడుగుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది. లాభాలు మంచిగానే ఉన్నాయి.