కొవిడ్ వైరస్ కొత్త వేరియంట్ వార్తల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నిబంధనల అమలు కఠినతరం చేశారు. కొత్త వేరియెంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండాపూర్‌లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురంలోని ఏరియా దవాఖానలో ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోస్‌లు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో మొదటి డోస్‌కు సంబంధించి 113 శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా.. మొత్తం 40,52,150 డోసులు పంపిణీ చేశారు. అలాగే 63 శాతం రెండో డోస్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. పీహెచ్‌సీలు, ప్రత్యేక కేంద్రాలతోపాటు జిల్లావ్యాప్తంగా 24 మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 5,84,565 మంది ఫస్ట్ డోస్, 1,29,507 మంది రెండు డోసుల టీకాను తీసుకున్నారు.
పరిగి, డిసెంబర్ 2 : కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం ద్వారా రాబోయే వివిధ వేరియెంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేసేందుకు అవసరం మేరకు డోసులు అందుబాటులో ఉన్నాయి. 18 సంవత్సరాలు పైబడిన వారు 7,09,728 మంది ఉండగా ఇప్పటివరకు మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు 5, 84,565 (82శాతం) మంది, రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు 1,29,507(18శాతం) మంది, ఒక్క డోసు సైతం వ్యాక్సిన్ వేయించుకోని వారు జిల్లాలో 1,25,163 మంది ఉన్నారు.
వందశాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి
డిసెంబర్ నెలాఖరు వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 పీహెచ్‌సీల్లో తక్కువ వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పరిధిలోని బషీరాబాద్, అంగడి రాయచూర్, చిట్యాల్, చన్గోముల్, పూడూరు, జిన్గుర్తి, సిద్దులూరు, పాత తాండూరులో తక్కువ వ్యాక్సినేషన్ జరిగినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్వోలు, వీఆర్ఏలు, బూత్ లెవల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శుల బృందం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎంతమంది వ్యాక్సిన్ అసలు తీసుకోలేదో లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఎంతమంది ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లారనేది సైతం స్పష్టంగా సర్వే చేస్తున్నారు. తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారి, ఇతర ఉన్నతాధికారులు సందర్శించి వ్యాక్సినేషన్ వేగవంతానికి చర్యలు చేపట్టనున్నారు.
257 కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రక్రియ..
వికారాబాద్ జిల్లా పరిధిలో 257 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వే స్తున్నారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని 97 వార్డులు, 138 గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలో రెండో డోసు వేసుకోవాల్సిన వారు గురువారం నాటికి ఓవర్ డ్యూ ఉన్నవారు 32వేల మంది ఉన్నారు. మొదటి డోసు వేసుకున్న తర్వాత 84 రోజులకు రెండో డోసు వేయించుకోవాలి. ఇందులో భాగంగా డిసెంబర్ రెండో వారంలో చాలామందికి ఓవర్‌డ్యూ వస్తుంది. అలాంటి వారికి ప్రత్యేకంగా 8 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసి రెండవ డోసు ఇస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించడంతోపాటు వ్యాక్సినేషన్ కేంద్రానికి రాని వారికి వైద్య సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేయడం, లేదంటే ఆటోలో తీసుకురావడానికి అవసరమైన డబ్బులు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని కలెక్టర్ ప్రకటించారు. తద్వారా ఏదో విధంగా అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రత్యేక కార్యాచరణతో అధికారులు పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మరింత వేగంగా లక్ష్యం పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలావుండగా ప్రస్తుతం జిల్లాలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ 1,52,990 డోసులు, కొవాగ్జిన్ 4,310 డోసులు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని డోసులు వ్యాక్సిన్ తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యాక్సిన్‌తోనే రక్షణ..
మరోవైపు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ముందుగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యమని వైద్యాధికారులు చెబుతున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ పొందవచ్చని, ఒకవేళ వైరస్ సోకినా ఎలాంటి ప్రాణహాని లేకుండా బయట పడవచ్చన్నది వైద్యాధికారుల అభిప్రాయం. అందువల్ల వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అవసరమైతే రోజువారీగా సమీక్షా సమావేశాలు జరిపి మరింత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. మాస్కు ధరించకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
61 హ్యాబిటేషన్లు, 11 కాలనీలలో..
జిల్లా పరిధిలోని 61 హ్యాబిటేషన్లు, 11 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన గ్రామాలు, కాలనీలను గుర్తించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రాంతాల్లో మరోసారి వైద్యాధికారులు, సిబ్బంది పరిశీలించి వివరాలు సేకరించనున్నారు. కొత్తగా ఎవరైనా అద్దెకు వస్తే వారు వ్యాక్సిన్ చేయించుకున్నారా లేదా పరిశీలించనున్నారు. ఇదిలావుండగా వంద శాతం వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశీలకులు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం తాండూరులో ఈ బృందం పర్యటించి వివరాలు సేకరించింది. వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండానే వారి పర్యటన కొనసాగుతున్నది. తద్వారా మరింత పకడ్బందీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలి
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మొదటి డోసు వేసుకున్న తర్వాత 84 రోజులకు రెండో డోసు వేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు వ్యాక్సిన్ 584565 మంది, రెండో డోసు 129507 మంది వేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఎంత మంది వ్యాక్సిన్ వేసుకున్నారు, వేసుకోవాల్సి ఉన్నది, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారనే వాటిపై సర్వే చేపడుతున్నాం. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
మంత్రి సబితారెడ్డి సమీక్ష..
కొవిడ్ వ్యాక్సినేషన్, కొత్త వేరియెంట్‌పై జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నిఖిల, వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సబితారెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెలాఖరు వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. కొత్త వేరియెంట్ వార్తల దృష్ట్యా ముందు జాగ్రత్తగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.