పరిగి, డిసెంబర్ 2 : వికారాబాద్ జిల్లాలో ఈ నెలాఖరు వరకు 100శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిఒక్కరికీ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. ప్రజల్లో వ్యాక్సిన్‌పై అపోహలను తొలగించాలని, రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే వైరస్ సోకినా ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చన్నది తెలియజేయాల్సిందిగా మంత్రి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ భవనంలో జరిగిన కొవిడ్ వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొవిడ్ మొదటి, రెండో వేవ్ సమయంలో వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ఇతర అన్ని శాఖల అధికారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని మంత్రి అభినందించారు. జిల్లా పరిధిలో మొదటి డోసు 82శాతం, రెండో డోసు 18శాతం మంది వేయించుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెలాఖరు వరకు 100శాతం రెండు డోసులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. వ్యాక్సిన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయన్నారు. ఇందుకుగాను ఎంపీపీలు, మండల స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కొవిడ్ వ్యాక్సినేషన్లో వారందరూ పాల్గొనేలా చూడాలన్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు నిమిత్తం వెళ్లిన వారిని గుర్తించి వారు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా తెలుసుకోవాలని, వేసుకోకపోతే వారు ఉంటున్న ప్రాంతంలో వ్యాక్సిన్ వేయించుకునేలా సూచించాలని మంత్రి చెప్పారు. తాండూరు ప్రాంతంలో సిమెంటు కంపెనీలు, క్వారీలు ఉన్నాయని, వాటిలో పనిచేసే వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతోపాటు మధ్యాహ్న భోజనం తయారు చేసే వారు సైతం రెండు డోసులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. రేషన్ దుకాణాల డీలర్లందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 61 హ్యాబిటేషన్లు, 11 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారని, ఈ ప్రాంతాల్లో మళ్లీ పరిశీలించాలని, కొత్తగా ఎవరైనా అద్దెకు వస్తే, వారు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని దవాఖానల్లో ఎన్ని బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి ఎప్పటికపుడు ప్రజలకు సమాచారం అందించాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి మాట్లాడుతూ కొవిడ్ రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు 82శాతం మంది వేయించుకున్నారని, రెండో డోసు 18శాతం వేయించుకున్నట్లు తెలిపారు. రెండో డోసుకు ఓవర్ డ్యూ గురువారానికి జిల్లా పరిధిలో 32వేల మంది ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రకారం వైద్య సిబ్బంది వారి ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపడుతామని అన్నారు. అవసరమైనచోట రవాణా సదుపాయం కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ నెలాఖరుకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికే వైరస్ 50 రూపాంతరాలు చెందిందని చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా వైరస్ సోకినా ప్రాణాలతో బయట పడవచ్చని, ఈ విషయాన్ని తెలియజేసి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే వందశాతం వ్యాక్సినేషన్ సాధ్యమని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వేగంగా లక్ష్యం సాధించవచ్చన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ఆధారంగా ప్రతి ఒక్కరిని కలిసి వ్యాక్సినేషన్ చేయించుకున్నారా లేదా తెలుసుకొని అందరికీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. సమావేశంలో టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, జడ్పీటీసీలు, ఎంపీపీ, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.