దోమ, నవంబర్ 2: సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అనసూయ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అతిత్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మండల వ్యాప్తంగా పాఠశాలల్లో 30 మంది ఉపాధ్యాయుల కొరత ఉందని ఎంఈవో హరిశ్చందర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. బాలుర ఉన్నత పాఠశాల నుంచి బాలికలను, బాలికల పాఠశాలలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రాజిరెడ్డి ఎమ్మెల్యేను కోరారు. బిల్లులు రాక ఆగిపోయిన షెడ్లకు వెంటనే బిల్లులు అందించేలా చూడాలని జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం ఏపీవో చంద్రశేఖర్‌కు సూచించారు. కేజీబీవీ పాఠశాలకు మిషన్ భగీరథ తాగు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఖాజా దృష్టికి తీసుకువచ్చారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీఎం సాయన్న పనితీరుపై ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పరిగి మార్కెట్ చైర్మన్ సురేం దర్‌రెడ్డి, ఎంపీడీవో జయరాం, డీఈ ఉమేశ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
లారీలకు అద్దె ధరలు పెంచేలా చూడాలని వినతి
పరిగి, నవంబర్ 2: పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం తరలింపు, కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపునకు సంబంధించి లారీల అద్దె ధరలు ప్రభుత్వం 40 శాతం పెంచేలా చూడాలని పరిగి ట్రక్ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. డీజిల్ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయని తద్వారా తక్కువ అద్దెకు వాహనాలు నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను దృష్టిలో ఉం చుకొని లారీ అద్దెలు కిలోమీటరుకు ఇచ్చే 40 శాతం పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌కు సైతం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ ఇద్రీస్, నాయకులు మీర్ యూసుఫ్ అలీ పాల్గొన్నారు.