నందికొండ, జులై 18 : కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వ ప్రధాని మోదీ విధానాలతో దేశం నాశనమైతుందని, మోదీని మళ్లీ గెలిపిస్తే దేశం నిర్వీర్యం అవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్ అన్నారు. నందికొండలో రెండు రోజుల పాటు జరిగే ఎఐఎడబ్ల్యూయూ (అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం) జాతీయ కమిటీ సమావేశాలు హిల్‌కాలనీ విజయవిహార్ మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వరదలు, మరోపక్క ధరల పెరుగుదలతో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. విమానాల కొనుగోలు పై ఉన్న శ్రద్ధ, ప్రజల కష్టాలపై ప్రధాని మోదీకి లేదని, 9 ఏండ్ల |పాలనలో మోడీ ప్రగతి తప్ప, ప్రజల ప్రగతి కనిపించడం లేదని ఎద్దేవ చేశాడు. దేశంలో నిరుద్యోగం, పేదరికం అనేక రేట్లు పెరిగిందని, ప్రజలు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్నారని వాపోయారు.
పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధుల తగ్గిస్తూ ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, భవిష్యత్తులో పథకం లేకుండా చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దేశంలో ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
మీడియాను, సోషల్ మీడియాను గుప్పిట్లో పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. బీజేపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలను చైతన్య పర్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సహాయ కార్యదర్శి ఎంపీ శివ దాసన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు పాలడుగు ప్రభావతి, నాగార్జున, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, బొజ్జ వెంకులు తదితరులు పాల్గొన్నారు.