విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ప్రోమో రోమాంచిత యాక్షన్ ఘట్టాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొని ఉండటంతో విజయ్ అభిమానులు హిట్ పక్కా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు విజయ్ దేవరకొండ. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేదని, ‘లైగర్’ సమయంలో ‘ది విజయ్ దేవరకొండ’ అనే ట్యాగ్ పెట్టుకోవడం వల్ల ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
“లైగర్’ ప్రమోషన్స్‌లో చిత్రబృందం నా పేరు ముందు ‘ది’ అనే పదాన్ని జోడించింది. అది చాలా కొత్తగా అనిపించడంతో ఓకే చేశా. ఆ తర్వాత దీనిపై చాలా విమర్శలొచ్చాయి. దాంతో ఆ ట్యాగ్‌ను తీసివేయాలని మా టీంను కోరాను. ఇప్పుడు ఎలాంటి ట్యాగ్ లేకుండా ఉన్న హీరోని నేనే కావొచ్చు. అయినా నాకు బిరుదులతో గుర్తుండిపోవాలని లేదు. ప్రేక్షకులు మంచి నటుడిగా గుర్తుంచుకుంటే చాలు’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.