హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జోన్‌లోని సైబర్‌సిటీ సర్కిల్లో విత్యుత్తు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలపై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) యాజమాన్యం ఎట్టకేలకు దృష్టి సారించింది. అక్కడి నిషేధిత భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు యూడీఎస్ కింద సర్వీస్ కనెక్షన్లు ఇవ్వడం, అందుకోసం నకిలీ డాక్యుమెంట్లు, హైకోర్టు ఉత్తర్వులను సృష్టించడంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వీ పాటిల్.. ఆ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. గత 2 రోజులపాటు ఆ సెక్షన్లో విచారణ చేపట్టారు.
ఏడీఈ అధికారిక లాగిన్‌ను ఆర్టిజన్‌కు ఎలా ఇచ్చారని ఈ విచారణలో అధికారులు ప్రశ్నించడంతోపాటు ఈఆర్వో, ఏఏవో పాత్రపై కూడా ఆరా తీసినట్టు తెలిసింది. చివరికి ఒక ఆర్టిజన్ స్వయంగా ఏడీఈ లాగిన్‌ను వాడి ఆయన సహకారంతోనే అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ సీఎండీకి మంగళవారం నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా తొలుత ఏడీఈపై, ఆ తర్వాత ఆర్టిజన్లపై చర్యలు చేపట్టే అవకాశం ఉన్నదని దక్షిణ డిస్కమ్ అధికారులు చెప్తున్నారు. కాగా, విజిలెన్స్ విచారణను సదరు ఆర్టిజన్లు చాలా తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విచారణతో తమకేమీ జరగదని వారు తమ సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం.