న్యూఢిల్లీ, ఆగస్టు 18: మారుతి సుజుకీ కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బాలెనో మాడళ్లు రూ.10 వేల వరకు అధికం కానున్నాయి. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడం, అంతర్జాతీయంగా నెలకొన్న నిరాశాజనక ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది.
కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలేరియో, వ్యాగన్ఆర్ మాడళ్లు రూ.2,500 వరకు అధికంకానుండగా, డీజైర్, టూర్ ఎస్ మాడళ్లు రూ.5 వేల నుంచి రూ.7 వేల లోపు అధికమయ్యాయి. వాటితోపాటు కమర్షియల్ వాహనాలైన సూపర్ క్యారీ, ఈకో మాడళ్లు రూ.2,500 వరకు పెరిగాయి. అలాగే ఎర్టిగా రూ.5-7,500 వరకు, బ్రెజ్జా రూ.5 వేల వరకు, ఈకో, సిఫ్ట్ మాడళ్లు రూ.5 వేల వరకు అధికంకానున్నాయి. గ్రాండ్ విటారా రూ.5 వేలు, ఫ్రాంక్స్ రూ.7,500, ఎక్స్ఎల్6 మాడల్‌ను రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు అధికమైంది.