అది 1989. రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విద్యార్థులమీద నుంచి యుద్ధ ట్యాంకులు వెళ్తున్నాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల గుండెలను చీల్చుతూ తూటాలు దూసుకుపోతున్నాయి. 33 ఏండ్ల కిందట చైనాలోని తియనాన్మెన్ స్కేర్‌లో జరిగిన రక్తపాతం మళ్లీ డ్రాగన్ దేశంలో తాజాగా జరుగనున్నదా? తాజాగా వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
-నేషనల్ డెస్క్
చైనాలోని పలు గ్రామీణ, చిన్న బ్యాంకులకు రక్షణగా యుద్ధ ట్యాంకులు కాపలా కాస్తున్నాయి. తమ సొమ్మును వెనక్కి ఇవ్వాలంటూ వేలాదిమంది ఖాతాదారులు ఆయా బ్యాంకుల ముందు నిరసనలకు దిగడమే దీనికి కారణం. ప్రభుత్వానికి ఆర్థిక అండదండలను కల్పిస్తున్న గ్రామీణ, చిన్న బ్యాంకులను రక్షించుకునేందుకు జిన్‌పింగ్ సర్కారు సొంత ప్రజలపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడడం లేదు.
నిరసనలు ఎందుకు?
ఖాతాదారులు దాచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చినట్లు షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ది బ్యాంక్ ఆఫ్ చైనా సహా హెనాన్, ఎన్‌హైల్లోని పలు గ్రామీణ, చిన్న బ్యాంకులు ఇటీవల ప్రకటించాయి. నగదు విత్‌డ్రాలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి. దీంతో జూలై మొదటి వారం నుంచి ఖాతాదారులు బ్యాంకుల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు ఉద్ధృతం కాడంతో తొలుత 50 వేల యువాన్లలోపు విత్‌డ్రాలకు కొన్ని బ్యాంకులు అంగీకరించినప్పటికీ, అనంతరం వాటిని కూడా నిలిపివేశాయి. దీంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తమ సొమ్ము కోసం వేలాది మంది పౌరులు రోడ్డెక్కారు. అయితే, ప్రభుత్వం కొనసాగడానికి కీలకంగా ఉన్న గ్రామీణ బ్యాంకులపై ప్రజాగ్రహం మరింత పెరిగితే కష్టమని గ్రహించిన జిన్‌పింగ్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వాటి రక్షణకు యుద్ధ ట్యాంకులను మోహరించినట్టు తెలుస్తున్నది.
విత్‌డ్రాలను ఎందుకు నిలిపేసినట్టు?
చైనాలో చిన్నా, పెద్ద కలిపి 4,400 వరకు బ్యాంకులున్నాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) నివేదిక ప్రకారం.. ఇందులో కేవలం 24 వరకే బ్యాంకులు సురక్షితమైనవి. డొల్ల బ్యాంకుల్లో అధిక భాగం గ్రామీణ, చిన్న బ్యాంకులే. అయినప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాల అమలు కోసం ఈ బ్యాంకులు సాయపడుతుండటంతో ప్రభుత్వం వాటి కార్యకలాపాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ఖాతాదారుల డబ్బును .. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టాలనుకున్న గ్రామీణ బ్యాంకులు.. వారిని ఆకర్షించాలనుకున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య బ్యాంకులు ఇస్తున్న 2.75 శాతం వడ్డీరేటు కంటే 1.75 శాతం ఎక్కువ వడ్డీరేటును అంటే డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీరేట్లను కస్టమర్లకు ఆఫర్ చేశాయి. దీంతో వడ్డీరేటు ఎక్కువగా వస్తుందన్న ఆశతో ఉన్నడబ్బునంతా పౌరులు గ్రామీణ, చిన్న బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశారు. ఆ సొమ్మునంతా రియల్ ఎస్టేట్ రంగానికి ఈ బ్యాంకులు బదిలీ చేశాయి. దీంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్.. ఫలితంగా రియల్ ఎస్టేట్ పడకేసింది. దీంతో ఆ ప్రభావం ఆర్థికరంగంపై పడింది. మరోవైపు, చిన్న బ్యాంకుల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న నివేదికలను పరిగణలోకి తీసుకొన్న చైనా సెంట్రల్ బ్యాంక్.. ఇంటర్నెట్ ప్లాట్ఫాంలని వినియోగించి డిపాజిట్లను సేకరించవద్దని 2021లో ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం గ్రామీణ, చిన్న బ్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో ఖాతాదారుల సొమ్మంతా రియల్ఎస్టేట్లో ఇరుక్కుపోవడం, చైనా సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలతో కొత్త డిపాజిటర్లలో అంతగా పెరుగుదల లేకపోవడంతో.. చివరకు బ్యాంకులు చేతులెత్తేశాయి.
యుద్ధ ట్యాంకులు అందుకు కాదట!
చైనాలోని బ్యాంకుల ముందు యుద్ధ ట్యాంకులు, సైన్యం మోహరింపు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, షాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రిఝె వద్ద నౌకాదళ స్థావరం ఉండటంతో యుద్ధ ట్యాంకులు అటువైపుగా వెళ్తున్నాయనీ, ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని స్థానిక మీడియా కొత్త భాష్యం చెబుతున్నది.
తియనాన్మెన్ స్కేర్‌లో ఏం జరిగింది?
జనరల్ సెక్రటరీగా ఉన్న హూయోబాంగ్ ఆకస్మిక మరణం, అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో అవినీతి, ద్రవ్యోల్బణం వెరసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు 1989, జూన్ 4న బీజింగ్‌లోని తియనాన్మెన్ స్కేర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గంటలవ్యవధిలోనే ఈ సంఖ్య లక్షల్లోకి చేరింది. ఆందోళనలను అణిచివేయడానికి ప్రభుత్వం యుద్ధట్యాంకులు, ఆయుధాలను ప్రయోగించింది. ఈ ఊచకోతలో 240 మంది వరకు మరణించగా.. వేలాదిమంది గాయపడ్డారు.