వరంగల్ ‘ఎంజీఎంలో డెడ్‌బాడీ కథ’లో కొత్త కోణం వెలుగుచూసింది. తమది కాని మృతదేహం ఇచ్చారంటూ తిరిగి మార్చురీకి పంపడం శుక్రవారం కలకలం రేపగా అసలు వ్యక్తి(కుమారస్వామి) బతికే ఉన్నాడని అది కూడా ఎంజీఎంలోనే ఉన్నాడని తెలిసి అంతా షాక్‌కు గురికావాల్సి వచ్చింది. మృతదేహం అప్పగించే క్రమంలో అవుట్‌పోస్టు పోలీసులు, తొర్రూరు పోలీసుల నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబాన్ని ఆగం చేసింది. కాగా ప్రస్తుతం కుమారస్వామికి ఎంజీఎంలో మెరుగైన వైద్యం అందిస్తుండగా, సంఘటనకు బాధ్యులపై విచారణ జరుగుతోంది.
– వరంగల్ చౌరస్తా, జూలై 12
రాయపర్తి మండలం మైలారంలో మృతదేహం తమ బంధువుది కాదని అంత్యక్రియలు నిలిపివేసి తిరిగి మార్చురీకి తరలించిన ఘటన ఎంజీఎంలో కలకలం రేపింది. మృతదేహం మారిపోతే మరి గోక కుమారస్వామి బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అనే సందేహంతో దవాఖాన అన్ని వార్డుల్లో క్షుణ్ణంగా వెతికారు. చివరికి ఐడీ వార్డులోనే ఉన్నట్లు తెలుసుకొని అంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న అతడి ఫొటోలను వెంటనే కుటుంబ సభ్యులకు పంపారు. అతడి కూతురు స్వప్న, అల్లుడు శ్రవణ్ ఎంజీఎం వచ్చి గుర్తుపట్టారు. కుటుంబ సభ్యులు, బాధితుడి భార్యతో ఆర్ఎం డాక్టర్ శశికుమార్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కుమారస్వామిని అక్కడినుంచి ఆర్థో వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అవసరమైతే కాలి గాయానికి శస్త్రచికిత్స చేస్తామని వైద్యాధికారులు తెలిపారు.
ఒకరు అనుకొని మరొకరు..
ఈ నెల 9న రైల్వే పోలీసులు రైలు నుంచి జారిపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అదే రోజు తొర్రూరు ప్రాం తంలో అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న గోక కుమారస్వామిని కూడా ఎంజీఎంహెచ్కు తీసుకొచ్చారు. తొర్రూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తి వివరాలు గుర్తించి అతడి భార్య రమకు సమాచారం అందించారు. ఎంజీఎం చేరుకున్న రమ తన భర్తను పోల్చుకోలేకపోతున్నానని, మరుసటి రోజు బంధువులతో కలిసి వస్తానని చెప్పి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి రమకు ఫోన్ చేసి న పోలీసులు నీ భర్త చనిపోయాడని, ఎంజీఎంకు వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పారు.
రాత్రి సమయంలో రాలేనని చెప్పి, శుక్రవారం ఉదయం తొర్రూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. విషయం తెలిపిన పోలీసులు ఎంజీఎం మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపించగా రమ గుర్తుపట్టలేకపోయింది. ఆమె సోదరుడు కూడా పోల్చుకోలేకపోవడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి మృతదేహాన్ని అప్పగించడంతో స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో కుమారస్వామి కూతురు, తోబుట్టువులు అది కుమారస్వా మి మృతదేహం కాదని గుర్తించి ఆందోళన చేయడంతో తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించారు.
అప్రమత్తమైన వైద్యాధికారులు మృతదేహం అప్పగింతలో జరిగిన తప్పిదంతో ఎంజీఎం వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. 9న వైద్యసేవల కోసం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎంతమంది అని విచారణ ప్రారంభించిన ఆర్ఎంవో శశికుమార్ శుక్రవారం క్యాజువాలిటీ రికార్డులను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తిగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి (గోక కుమారస్వామి)ని ఆర్థోకు, అక్కడినుంచి ఐడీ వార్డుకు తరలించినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ఒకే రోజు, ఒకే వార్డులో ఉండడం, రైల్వే పోలీసులు పంపిన వ్యక్తి మృతిచెందితే తొ ర్రూరు పోలీసులు పంపిన వ్యక్తిగా భావించి ఔట్‌పోస్టు పోలీసులు వారికి సమాచారం అందించడంతో గందరగోళం మొదలైనట్లు తెలుసుకున్నారు. ఈ విషయంలో వైద్యాధికారుల తప్పేమీలేదని, సమాచార లోపంగా గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆర్ఎంవో తెలిపారు.