హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను, అది ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. ప్రభుత్వం ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించిన హైకోర్టు మార్చిన 12న తీర్పును రిజర్వు చేసింది.
జీవో 6ను కొట్టివేయాలని, జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించనున్నది.