హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. 7వ శతాబ్దం నాటి ఈ కథలో గోపీచంద్ పూర్తి మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘గోపీచంద్33’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భారత వర్ష్’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు తెలిసింది. భారత ఉపఖండానికి ప్రాచీన మరియు భౌగోళిక నామం ఇది.
ఈ చారిత్రక చిత్రానికి కథానుగుణంగా ఈ పేరు బాగుంటుందనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీతూవర్మ కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.