వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి బుడంగారి మహేశ్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, బ్రాహ్మణ సేవా సంఘం, దేవస్థానం అనువంశిక అర్చక ట్రస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేవాలయ ఉన్నతాధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులతో, దేవస్థానం ఉద్యోగ సంఘం నాయకులతో కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం భావ్యం కాదని పేర్కొంది. సమాజంలో అన్ని వర్గాల శ్రేయస్సును, లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని అనునిత్యం భావించే, తమ వర్గానికి చెందిన వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందని తెలిపింది. గతంలో సైతం ఆలయ ఉన్నతాధికారులు దేవస్థానంలో పనిచేసే అర్చకులను, వేద పండితులను కూడా ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేయడం, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్షకట్టడం, భీమన్న దర్శనానికి వచ్చే అనువంశిక అర్చక కుటుంబాలను సైతం దర్శనం చేసుకుని ఇవ్వకుండా, సూటిపోటి మాటలతో వేధించడం ఆమెకు నిరంతర ప్రక్రియగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా దేవాలయ ఉన్నతాధికారులు తన పద్ధతిని మార్చుకొని, మహేశ్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తమ సంఘం ప్రత్యక్ష కార్యాచరణకు పాల్పడుతుందని హెచ్చరించింది.